ఎంపీ,ఎమ్మెల్యేలను అత్యవసరంగా సమావేశానికి పిలిచిన కేసీఆర్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 105 సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. ఇందు కోసం చేయాల్సింది ఏమీ లేదని.. ఇంటింటికి తిరిగి ప్రజలకు ఏం చేశామో చెప్పుకుంటే చాలన్నారు. అదే గెలిపిస్తుందని గడిచిన పదేళ్లలో ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చెప్పాలని నేతలకు సీఎం సూచించారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను, గడిచిన 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చెప్పారు.
మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉంటాయని, లీడర్లు పూర్తి స్థాయిలో నియోజకవర్గాలకు పరిమితం కావాలని అన్నారు. గడిచిన 70 ఏళ్లలో కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరన్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రజా ప్రతినిధులు ఎలా సమాయత్తం కావాలో సూచించారు. ఇప్పటిదాకా తమ ప్రభుత్వం చేసింది చెప్పుకుంటే చాలని చెప్పారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలియజెప్పాలని నిర్దేశించారు. రైతులను చెరువుల దగ్గరకు పిలిచి మీటింగ్ పెట్టాలని, చెరువు గట్ల మీద రైతులతో కలిసి భోజనం చేయాలని చెప్పారు.
జూన్ 2న తెలంగాణ అవతరణ ఉత్సవాల నిర్వహణపై కూడా సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. మంత్రులు ఆయా జిల్లాలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పర్యవేక్షించాలని నిర్దేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తరపున కూడా గ్రామ, గ్రామాన వేడుకలు ఘనంగా నిర్వహించాలని నేతలను ఆదేశించారు.