vసంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభిస్తాం.. తెలంగాణ భవన్ కన్నా బిజీ అయిపోతుంది అని.. కేసీఆర్.. తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నప్పుడు చెప్పారు. ఇప్పుడు సంక్రాంతి అయిపోయి ఐదు నెలలు అవుతోంది.. ఇంకా పార్టీ ఆఫీసు ప్రారంభం కాలేదు..ఇక బిజీ అవుతుందా లేదా అన్నది ఎవరికీ తెలియదు. ఇంకా ఆలస్యం అయితే అసలు బీఆర్ఎస్ ఏపీలో ఉందా లేదా అని అనుకుంటారనుకున్నారేమో కానీ ఓ సాదాసీదా భవనాన్ని ఆటోనగర్లో అద్దెకు తీసుకుని రంగులేసి ప్రారంభించేస్తున్నారు.
ఆఫీసు ప్రారంభోత్సవం కూడా అతి సాదాసీదాగా సాగనుంది. గతంలో అయితే ఆఫీసు ప్రారంభోత్సవం.. అతి పెద్ద బహిరంగసభ అని ప్రచారం చేశారు. ఇప్పుడు అయితే అసలు కేసీఆర్ కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆదివారం రోజు ఉదయం ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖరే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనునన్నారు. ఎలాంటి బహిరంగసభను ఏర్పాటు చేయడం లేదు. తెలంగాణ నుంచి కీలక నేతలెవరూ హాజరు కావడం లేదు.
పెద్ద ఎత్తున ఏపీ నుంచి చేరికలు ఉంటాయని అనుకున్నప్పటికీ పెద్దగా ఎవరూ పార్టీలో చేరకపోవడంతో బీఆర్ఎస్ వర్గాల్లో జోష్ లేకుండా పోయింది. ఇటీవల స్టీల్ ప్లాంట్ అంశంలో తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ దాఖలుచేయాలని నిర్ణయించడంతో ఆ పార్టీ నేతలు హుషారుగా రాజకీయం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గామని కేంద్ర మంత్రి ప్రకటించడంతో ఇక విజయోత్సవ సభ నిర్వహించాలని అనుకున్నారు. కానీ కేంద్రం ప్రైవేటీకరణకే కట్టుబడి ఉన్నామని చెప్పడంతో బీఆర్ఎస్కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అసలు కేసీఆర్ ఇప్పుడు ఏపీలో పార్టీ గురించి పట్టించుకోకపోతూండటంతో.. తోట చంద్రశేఖర్ .. తప్పనిసరి అన్నట్లుగా పార్టీ ఆఫీసు ప్రారంభిస్తున్నారు.