దళిత బందు ఇచ్చినట్లుగా ఒక్కొక్కరికి రూ.పది లక్షలు ఇవ్వలేం కానీ.. కనీసం లక్ష అయినా బీసీలకు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. దళిత బంధు పథకం తర్వాత బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్న అభిప్రాయం బలపడటంతో వారి కోసం ఎన్నికలకు ముందు ఏదో ఒకటి చేయాలని కేసీఆర్ మేధోమథనం చేశారు. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారిని మరింత ఆర్థికంగా బలోపేతం చేయాలంటే ఓ లక్ష ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకం అమలు నిబంధనలు, ఇతర విషయాలు ఖరారు చేయడానికి మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన కేబినెట్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీ విశ్వబ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు, రజకులు, మేదరి, కుమ్మరి తదితర వృత్తి కులాల వారికి ప్రోత్సాహకాలు అందించేలా విధివిధానాలు ఖరారు చేస్తుంది.
ఈ సబ్ కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పథకం అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. జూన్ 2 నుంచి 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ వరకు దశాబ్ది ఉత్సవాలు జరపనున్నారు. ఇందు కోసం రెండు వందల కోట్ల వరకూ కేటాయిస్తున్నారు. సచివాలయంలో తొలి రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయి.. .. అదే రోజు రాష్ట్ర మంత్రులు ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఈ ఉత్సవాల్లోనే బీసీలకు రూ. లక్ష సాయం పథకం ప్రారంభించనున్నారు.
అయితే దళితులకు ఎలాంటి అర్హతలు పెట్టలేదు. అందరికీ ఇస్తామని చెబుతున్నారు. కొంత మందికి ఇచ్చారు. మరి బీసీలకు అర్హతలు పెడితే వివాదాస్పదం అవుతుంది. అరకొరగా ఇచ్చినా అసంతృప్తి పెరుగుతుంది. దళితులకు పది లక్షలు ఇచ్చి బీసీలకు రూ. లక్షేనా అన్న మాటలు కూడా వినిపిస్తాయి. ఇదంతా కేసీఆర్ రాజకీయ నిర్ణయాల వల్ల వచ్చే విమర్శలే. వాటిని ఆయన ఎదుర్కోగలరని.. బీసీలంతా బీఆర్ఎస్ వైపు ఉండేలా చూస్తారని ఆ పార్టీ నేతలు గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు.