తెలంగాణ బజేపీలో చేరేవారు లేరు కానీ బయటకు పోయేవారు ఎక్కువగానే ఉన్నారని మెల్లగా ఓ క్లారిటీ వస్తోంది. కవితను అరెస్ట్ చేయకుండా దోస్తీ చేస్తున్నారని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి తొలి సారి ఫైరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తీ…గల్లీలో కుస్తీలా వ్యవహరిస్తున్నాయని అందుకే బీజేపీ ఎదగడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు . ఢిల్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. తాజా సంక్షోభానికి అద్దం పడుతున్నాయ.ి
తెలంగాణలో భారతీయ జనతాపార్టీ ఎదుగకపోవడానికి బీఆర్ఎస్ పార్టీతో ఉన్న అంతర్గత దోస్తీ కారణంగానే ఎదగలేకపోతున్నామని కారణమని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అవుతుందని అనుకున్నారని కానీ అరెస్ట్ చేయలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అందుకే బీజేపీ దూకుడుకు బ్రేక్ పడిందన్నారు. జూపల్లి పొంగులేటిలు కూడా అందుకే పార్టీలో చేరడం లేదని.. ఎవరూ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు. కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లనేప్రజలు రెండు పార్టీలు ఒకటేనని అనుకుంటున్నారన్నారు. తెలంగాణలో మరో కొత్త ప్రాంతీయ పార్టీకి అవకాశం లేదని.. అలా ఎవరైనా పార్టీ పెడితే.. కేసీఆర్ పురిటిలోనే చంపేస్తారన్నారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు బీజేపీలో సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క రోజు ముందే కేసీఆర్ ను ఓడించడానికి బీజేపీలో ఉన్న నేతలు కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అలా పిలుపునిచ్చిన వారిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. కేసీఆర్ ను ఓడించే పార్టీలోనే తాను చేరుతానని గతంలో చెప్పేవారు. ఇప్పుడు బీజేపీతో కేసీఆర్ దోస్తీలో ఉన్నారన్న స్పష్టత రావడంతో ఆయన బయటపడినట్లుగా చెబుతున్నారు. ఆయనతో పాటు మరికొందరు కాంగ్రెస్ లో చేరే సూచనలు కనిపిస్తున్నాయని ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.