హిండెన్ బెర్గ్ వెల్లడించిన అదానీ కంపెనీల లొసుగుల్లో ఒక్కటి కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు కనిపించలేదట. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు చెప్పింది. క్లీన్ చిట్ ఇవ్వలేదు కానీ.. ఇచ్చినట్లుగా ఉన్న ఈ నివేదిక వ్యాపారవర్గాల్లో మాత్రం విస్తృత చర్చకు కారణం అవుతోంది. ఎలాంటి రెగ్యూలేటరీ సంస్థ అయినా బలవంతుడి ముందు తలవంచాల్సిందేనని .. ఇదే వ్యవస్థల పని తీరు అన్న నిట్టూర్పు వినిపిస్తోంది.
ఇదే సెబీ గతంలో విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడుల లెక్కలు లేవని అదానీపై విచారణ జరిపింది. ఇంకా అనేక అంశాలపై చాలా సార్లు విచారణ జరిపింది. 2016 నుంచి విచారణ జరుపుతున్నారని కేంద్రం.. అలాంటిదేమీ లేదని ఆర్బీఐ చెప్పుకొస్తున్నాయి. ఇలా పరస్పర విరుద్దమైన ప్రకటనలతో అదానీని గట్టున పడేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అదానీ మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంటుందో కర్ణాటక ఫలితాలే నిరూపించాయి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే అదానీ షేర్లు కుప్పకూలిపోయాయి.
రేపు కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోతే.. అదానీ వ్యాపార సామ్రాజ్యాలన్నీ కుప్పకూలిపోతాయని ఎక్కువ మంది నమ్మకం. అదో కళ్ల ముందు కనిపించే పేక మేడ అని.. కేంద్రం మద్దతుతోనే నిలబడి ఉందని మార్కెట్ నిపుణులు చెబుతూ ఉంటారు . అయితే దాన్ని కాపాడటానికి ఇప్పుడు పవర్ ఫుల్ పర్సన్స్ చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు. ఎంత జరిగినా అదానీ లక్ అంతా.. పవర్ లోనే ఉంది. అది ఉన్నంత కాలం అదానీకి తిరుగు ఉండకపోవచ్చంటున్నారు.