ఆర్.ఆర్.ఆర్ తరవాత ఎన్టీఆర్, చరణ్ మంచి ఫ్రెండ్సయిపోయారు. అంతకు ముందే వాళ్ల మధ్య మంచి స్నేహం ఉంది. ఆర్.ఆర్.ఆర్ తో అది మరింత బలపడింది. ఈనాటి ఎన్టీఆర్తోనే కాదు, ఆనాటి ఎన్టీఆర్‌తోనూ… చరణ్ కి అనుబంధం ఉంది. ఓసారి.. చరణ్ ఎన్టీఆర్‌ని అనుకోకుండా కలిశాడు. ఇద్దరూ బ్రేక్ ఫాస్ట్ కూడా చేశారు. అప్పుడు చరణ్ ఐదో తరగతి చదువుతున్నాడట. ఈ విషయాన్ని చరణ్ స్వయంగా వెల్లడించాడు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్ని పురస్కరించుకొని ఈరోజు హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి కొంతమంది సెలబ్రెటీలు హాజరయ్యారు. వాళ్లలో చరణ్ కూడా ఉన్నాడు. ఈ వేదికపై ఎన్టీఆర్‌ని గుర్తు చేసుకొన్నాడు చరణ్. చిన్నప్పుడు పురంధేశ్వరి అబ్బాయితో తనకు స్నేహం ఉండేదని, ఇద్దరూ స్కేటింగ్ క్లాసులకు వెళ్లేవాళ్లమని, ఓరోజు స్కేటింగ్ క్లాస్ అయిపోయిన తరవాత… `మా తాతయ్యని చూద్దువుగానీ రా..` అంటూ తన స్నేహితుడు ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లాడని, ఆ సమయంలో ఎన్టీఆర్ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారని, తనకు కూడా వడ్డించారని ఆ రోజుల్ని గుర్తు చేసుకొన్నాడు చరణ్.
ఈరోజుల్లో తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడుకొంటోందని, అయితే ఆరోజుల్లోనే ఎన్టీఆర్ తెలుగు సినిమా గొప్పదనం ఖండాంతరాలకు తెలియజేశారని, ఆ మహానటుడు పని చేసిన పరిశ్రమలో తాను కూడా ఉండడం గర్వంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు.