ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల ఉంటే ? ఈ ఆలోచన ఇప్పటి వరకూ రాలేదు. ప్రియాంకా గాంధీకి, షర్మిలకు కూడా వచ్చిందో రాలేదో తెలియదు కానీ ఆర్కే మాత్రం తన కొత్త పలుకులో వెల్లడించేశారు. ముందుగా ప్రియాంకా గాంధీకి వచ్చిందని .. ముచ్చట్లు కూడా జరిగాయని ఆయన ఈ వారం కీలక విషయం వెల్లడించారు. డీకే శివకుమార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న షర్మిల కర్ణాటక ఫలితాల కంటే ముందే ప్రియాంకా గాంధీతో మాట్లాడారంటున్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత శివకుమార్ ను బెంగళూరులో షర్మిల కలిశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం వార్తలొచ్చాయి. వాటిని షర్మిల ఖండించినప్పటికీ.. అలాంటి చాన్స్ లేదని చెప్పలేమన్న అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది.
ఆర్కే చెప్పినట్లుగా ఏపీలో రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ నిర్వీర్యమైపోలేదు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి స్థానాలు సాధించింది. అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్న తర్వాతనే కాంగ్రెస్ నిర్వీర్యమైపోయింది. ఆ పార్టీ ఓటు బ్యాంక్ మొత్తం జగన్ వైపు వెళ్లిపోయింది. ఆ ఓటు బ్యాంక్ మొత్తం పార్టీకి రావాలంటే ఓ నాయకుడు కావాలి. అలాంటి నాయకత్వం షర్మిల ఇస్తుందని ఆర్కే లాజిక్. తెలంగాణ ఎన్నికల తర్వాత ఏదైనా జరగడానికి అవకాశం ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఆర్కే ఈ విషయాలను జనంలోకి పంపడానకి ప్రయత్నించారు.
నిజగా ప్రియాంక, షర్మిల మధ్య చర్చలు జరిగాయో లేదో కానీ జగన్మోహన్ రెడ్డిని తికమక పెట్టి.. షర్మిల కాంగ్రెస్ రూపంలో ఏపీకి వస్తుందేమో అన్న ఆందోళనకు గురి చేసి.. ఆస్తులు ఇప్పించాలన్న ఆ ఓ ఆలోచన ఆర్కే ఆర్టికల్ లో అంతర్గతంగా కనిపిస్తోంది. షర్మిలకు జగన్ దగ్గర నుంచి రావాల్సిన ఆస్తుల గురించి పదే పదే రాస్తున్నారు ఈ మధ్య ఆర్కే. ఇందులోనూ ఆస్తుల ప్రస్తావన తీసుకు వచ్చారు.
తెలంగాణ ఎన్నికల్లో షర్మిల పార్టీ అద్భుతాలు కాదు కదా..అసలు ఉనికి చాటుకుంటుందనే నమ్మకం ఎవరికీ లేదు. పాలేరులో షర్మిలకు డిపాజిట్ వచ్చినా ఆశ్చర్యమే. ఆ తర్వాత తెలంగాణలో చేయడానికి ఏమీ ఉండదని.. ఆమె రాజకీయం అంతా ఏమైనా ఉంటే ఏపీలో ఉంటేనే ఆదరణ ఉంటుందనే అభిప్రాయం ఏర్పడితే.. ఏప్రిల్ లో జరగాల్సిన ఎన్నికల కంటే ముందే .. షర్మిల ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఆర్కే కూడా అదే చెబుతున్నారు.