బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నోటి నుంచి కాంగ్రెస్ ను మాత్రమే విమర్శిస్తున్న మాటలు వస్తున్నాయి. బీజేపని పల్లెత్తు మాట అనలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో తెలంగాణ భవన్ లో సమావేశం అయ్యారు. లోపలేం మాట్లాడారో తెలియదు కానీ.. మీడియాకు ఇచ్చిన సమాచారంలో .. బీజేపీని పల్లెత్తు మాట అన్నట్లుగా చెప్పలేదు. 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని విమర్శించినట్లుగా చెప్పుకొచ్చారు. అంతేనా నాందెడ్లో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు శిక్షణా శిబిరం పెట్టి ప్రసంగించారు. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ, షిండే ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు.
కేసీఆర్ తీరు చూసి అదేంటి బీజేపీపై యుద్ధం అని కత్తి, డాలు పట్టుకుని బయలుదేరి తన లోకల్ పార్టీని జాతీయపార్టీకి గా చేసి ఇప్పుడు కాంగ్రెస్ నే విమర్శిస్తున్నారు.. బీజేపీ జోలికి వెళ్లడం లేదు అనే సందేహం సొంత పార్టీ నేతలకే వస్తోంది. బీజేపీతో రాజీ జరిగిపోయిందేమో లేకపోతే.. బీజేపీని రెచ్చగొట్టడం ఎందుకన్న ఉద్దేశంతో ఆగిపోతున్నారేమోనని వారికి వారు సర్ది చెప్పుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ కన్నా కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా గుర్తించడం వల్లనే కేసీఆర్ స్టాండ్ మార్చారని మరికొందరు విశ్లేషించుకుంటున్నారు.
కారణం ఏదైనా కేసీఆర్ రాజకీయం మాత్రం ప్రజల్లో చులకన అయిపోంది. జాతీయ పార్టీ పెట్టి.. ఎక్కడా పార్టీని విస్తరించే ప్రయత్నం చేయకుండా.. మహారాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమే.. సభలు, సమావేశాలు పెట్టి.. ఏం సాధిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేసుల ఒత్తిళ్లు ఉంటాయని తెలియకుండానే పార్టీని జాతీయ పార్టీగా మార్చారా అనే సందేహాలు చాలా మందిలో వస్తున్నాయి. కారణం ఏదైనా కేసీఆర్ రాజకీయం మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ లో అంత సీరియస్ అనిపించడం లేదు.