ఏపీలో బీఆర్ఎస్ ఆఫీస్ .. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కన్నా బిజీగా మారుతుందని కేసీఆర్ తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరినప్పుడు జోస్యం చెప్పారు. అయినా నాలుగు నెలల తర్వాత ఏపీలో ప్రారంభించిన ఆ పార్టీ ఆఫీసు కార్యక్రమాన్ని ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ నుంచి తలసాని లాంటి వాళ్లను కూడా పంపలేదు. చివరికి .. పార్టీ ఆఫీసును తానే ప్రారంభించుకున్నారు తోట చంద్రశేఖర్.
హైదరాబాద్ లో తనకు నలభై ఎకరాలిచ్చారని.. అందుకే ఆ పార్టీలో చేరారన్న విమర్శలు వచ్చాయి. కారణం ఏదైనా ఆయన బీఆర్ఎస్ లోచేరారు కానీ ఏం చేయాలో తెలియక అక్కడే ఉండిపోయారు. కేసీఆర్ భారీ ఆఫీసు చూడాలని.. పెద్ద బహిరంగసభ పెడదామని ముందు చెప్పారు. విశాఖలో ఆఫీసు అనుకున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులతో కాస్త పాలిటిక్స్ చేశారు. ప్లాన్లు తిరగబడే సరికి అంతా సైలెంట్ అయిపోయారు. గుట్టుగా గుంటూరులోనే ఆఫీసు తీసుకుని సైలెంట్ గా ప్రారంభించేశారు.
ఒడిషాలోనూ అంతే . మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ ఫ్యామిలీ మొత్తాన్ని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ఆ పార్టీకి ఒడిషా ఇంచార్జ్ గా ప్రకటించారు. కానీ పట్టించుకున్నవారు లేరు. పార్టీ ఆఫీసు తీసుకున్నది లేదు. ప్రారంభించింది లేదు. దిగాం కాబట్టి తోట చంద్రశేఖర్ కు పార్టీ ఆఫీసు ప్రారంభించక తప్పలేదు. కానీ ఎవరూ పట్టించుకోకపోవడం ఆయనకు ఇబ్బందే. కానీ కేసీఆర్ ను నమ్ముకున్నారు కాబట్టి.. ఈదక తప్పదని ఆయనకు అర్థం అయిపోయింది.