జగన్ పొమ్మన్నా పార్టీ నుంచి పోనంటూ మాజీ మంత్రి అనిల్ చేస్తున్న ప్రకటనలు నెల్లూరు రాజకీయాల్లో వైసీపీ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి .. ఇక అనిల్ ను పార్టీ నుంచి సాగనంపాలని అనుకుంటున్నారని ఆ విషయంపై ఆయనకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు. అనిల్ కు వ్యతిరేకంగా ఆయన బాబాయ్ రూప్ కుమార్ ను జగన్ పరోక్షంగాప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు.
నెల్లూరు జిల్లాలో అనిల్ కి తొలిదఫా మంత్రి పదవి రావడంతో ఆయన అతి చేశారు. దీంతో చాలా మంది దూరమైపోయారు. రెండో దఫా ఆయనకు మంత్రి పదవి పోయింది. ఆ స్థానం కాకాణి గోవర్దన రెడ్డికి దక్కింది. దీంతో నెల్లూరులో రాజకీయం మారింది. అనిల్ బాబాయ్ రూప్ కుమార్ కు పార్టీలో ప్రాధాన్యం పెరిగింది. ఆయన డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. అనిల్ అనుచురలులంతా రూప్ కుమార్ వైపు వెళ్లిపోయారు. వారంతా అనిల్ కి వ్యతిరేక వర్గంగా మారారు. నెల్లూరు అర్డన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తో కూడా అనిల్ కి సఖ్యత లేదు. అనిల్ నెల్లూరు జిల్లాలో ఒంటరిగా మారిపోయారు…కాదు ఒంటరిని చేశారని గుసగుసలు వినపిస్తున్నాయి.
అనిల్ గెలుపోటముల సంగతి పక్కనపెడితే… ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు కనీసం టికెట్ వస్తుందా లేదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే అనిల్ స్వయంగా టికెట్ విషయంలో నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసారు. తనకు టికెట్ ఇవ్వనని సీఎం జగన్ చెప్పినా.. తాను గెటౌట్ అన్నా కూడా పార్టీనుంచి వెళ్లిపోను అన్నారు. రూప్ కుమార్ కు టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదంతా ప్లాన్డ్ గానే హైకమాండ్ చేస్తోందని తెలిసినా ఏమీ చేయలేని స్థితిలో అనిల్ ఉన్నారంటున్నారు.