ఆదివారం చిత్రసీమలో ఓ విషాదం చోటు చేసుకొంది. సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. కోటితో కలిసి ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించారాయన. కొన్ని సినిమాల్లోనూ నటుడిగా మెరిశారు. రాజ్ మరణం.. చిత్రసీమని విషాదంలో ముంచెత్తింది. ఈలోగా మరో చేదు వార్త టాలీవుడ్ అంతా చక్కర్లు కొడుతోంది. నటుడు సుధాకర్ ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందన్నది సారాంశం. ప్రస్తుతం ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నారని, పరిస్థితి ఆందోళన కరంగా ఉందని తెలుస్తోంది.
సుధాకర్ ఆరోగ్యం గురించి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. ఆయన ఇది వరకు ఓసారి కోమాలోకి కూడా వెళ్లొచ్చారు. అత్యంత విషమం అన్న స్థితి నుంచి మళ్లీ కోలుకొన్నారు. కానీ.. ఆయన సినిమాలు చేయడం లేదు. సినిమాలకు దూరంగా, పూర్తిగా విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. మీడియాకి కూడా దూరంగా ఉంటున్నారు. ఆయన ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు కుటుంబ సభ్యులు ప్రకటించాల్సివుంది. మరో నటుడు శరత్ బాబు కూడా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన ఐసీయూలో చికిత్స తీసుకొంటున్నారు.