ఈసారి కప్పు మనదే… అంటూ ప్రతీసారీ చెప్పడం, ఉత్తి చేతులతో ఉసూరుమనిపించడం బెంగళూరుకి మామూలైపోయాయి. ఐపీఎల్ లో ఈసారి బెంగళూరు ప్లే ఆఫ్‌కి వెళ్లకుండానే నిష్క్రమించింది. బెంగళూరు అభిమానుల్ని తీవ్ర అసంతృప్తిలో ముంచెత్తింది. ముంబై తరవాత.. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు బెంగళూరే. ఎందుకంటే… ఈ జట్టులో కోహ్లీ, డూప్లెసిస్, మాక్స్వెల్ లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా కింగ్ కోహ్లీ ఒక్కడు చాలు. జట్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గెలిపించే నైపుణ్యం అతని సొంతం. ముగ్గురు ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లు ఉన్న జట్టు ఇది. ముగ్గురూ ఫామ్‌లోనే ఉన్నారు. ఐనా సరే.. బెంగళూరు ప్లే ఆఫ్‌కి చేరలేకపోయింది.
ఐపీఎల్ ప్రారంభంలో కోహ్లీ ఫామ్ లో లేడు. కానీ.. మెల్లమెల్లగా పుంజుకొన్నాడు. వరుసగా రెండు సెంచరీలు చేశాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. డూప్లెసిస్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో తానూ ఒకడు. మాక్స్ వెల్ అప్పుడప్పుడూ మెరుపులు మెరిపించాడు. కానీ అవన్నీ… బెంగళూరు అభిమానుల ఆశలు నెరవేర్చలేదు. దానికి కారణం.. పేలవమైన బౌలింగే. సిరాజ్ మినహాయిస్తే ఈ ఐపీఎల్ లో బెంగళూరు తరపున అదరగొట్టిన బౌలర్ లేడు. ఓ నాణ్యమైన స్పిన్నర్ కరువయ్యాడు. హసరంగ కొన్ని మ్యాచ్‌లు ఆడాడు కానీ, తన ప్రభావం అంతంత మాత్రమే. గత ఐపీఎల్ లో గొప్ప ఫినిషర్‌గా పేరు తెచ్చుకొన్న దినేష్ కార్తీక్ ఈసారి ఘోరంగా విఫలం అయ్యాడు. కోహ్లి, డివిలియర్స్, మాక్స్వెల్ వికెట్లు పడితే… సైకిల్ స్టాండ్ లా టప టప మిగిలిన వికెట్లు చేజార్చుకోవడం బెంగళూరుకి అలవాటుగా మారింది. అందుకే… చాలా మ్యాచ్‌లలో చేచేతులా ఓడింది.
క్రికెట్ ఎప్పుడూ కలిసి కట్టుగా ఆడే ఆట. ఒక్కడి వల్ల ఏం కాదు. ఈ విషయం బెంగళూరుని చూస్తే అర్థమవుతోంది. అందుకే ఆరో స్థానంలో నిలబడి పోయి ప్లే ఆఫ్‌కి దూరమైంది. అయితే.. బెంగళూరు అభిమానులు మాత్రం ఒకందుకు హ్యాపీగానే ఉన్నారు. తమ కింగ్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు. చివరికి వరకూ ఓటమి ఒప్పుకోని అతని తత్వం మరోసారి ఫ్యాన్స్‌కి నచ్చింది. అందుకే బెంగళూరు ఓడినా… కోహ్లీ గెలిచాడు.