తెలంగాణ బీజేపీ చీఫ్ ను మార్చే ప్రసక్తే లేదని హైకమాండ్ క్లారిటీ ఇవ్వడంతో బండి సంజయ్ కు ఎక్కడా లేనంత హుషారు వచ్చింది. ఆయన డిల్లీ నుంచి వచ్చిన వెంటనే.. టిక్కెట్లు ఎవరికి ఇస్తామో క్లారిటీ ఇచ్చారు. ఎంత పెద్ద లీడర్ అయినా సరే సర్వేల్లో గెలిచే వారికే టిక్కెట్లు ఇస్తామని ప్రకటించేశారు. ఇలాంటి అంశంలో బేరాలు ఉండవని క్లారిటీ ఇచ్చేశారు. ఆయన ప్రకటనతో … రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేసిన వారికి షాక్ తగిలినట్లయింది.
ఓ వైపు బండి సంజయ్ ఇలా ప్రకటన చేయగానే.. రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సర్.. అసంతృప్తి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో పూర్తిగా తెలుసని.. పార్టీలైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. అందరూ మాట్లాడుతున్న విషయాలు హైకమాండ్ దగ్గర ఉన్నాయన్నారు. వచ్చే నెల రోజుల పాటు తెలంగాణలో ఇంటింటికి వెళ్లాలని అలా వెళ్లిన నేతలనే పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
ఇటీవల కవితను అరెస్ట్ చేయేలదని విశ్వేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి పిలుపులు వస్తున్నాయని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అలాగే చాలా మంది నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో అటు బండి సంజయ్..ఇటు సునీల్ భన్సల్.. పార్టీలో అసంతృప్త నేతలకు హెచ్చరికలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ అసంతృప్త నేతలంతా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారే కావడం అసలు విశేషం. వీరంతా ఇప్పుడు ఏం చేస్తారన్న చర్చ జరుగుతోంది.