జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఇతర రాష్ట్రాలకు వెళ్లి అందర్నీ కలిసిన కేసీఆర్ ను..ఇప్పుడు వాళ్లెవరూ పట్టించుకోవడం లేదు. నితీష్ కుమార్, స్టాలిన్ ఇలా ఎవరూ కేసీఆర్ను పిలువడం లేదు. పలకరించడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా నిర్వహిస్తున్న కూటమి పోరాటంలోకి రావాలని ఆహ్వించడం లేదు. దీంతో కేసీఆర్ ఒంటరి అయిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో జాతీయ రాజకీయాల్లో బీజేపీ యేతర, కాంగ్రెస్ యేతర ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసి చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఆశలకు పూర్తి స్థాయిలో గండిపడినట్లయింది.
తనతో కలిసి వస్తాయనుకున్న ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు దూరం జరుగుతుండటంతో ఆయన ఏకాకిగా మారిపోయారు. డీఎంకే, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, ఎస్పీ, జేఎంఎం, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ తో దోస్తీకి సిద్ధమవుతున్నాయి. కేసీఆర్ తో గతంలో భేటీ అయిన చిన్నచిన్న పార్టీలు కూడా ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేవు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చనప్పుడు కేసీఆర్ వెంట ఉన్న కుమారస్వామి, తమిళనాడుకు చెందిన ఎంపీ వీసీకే పార్టీ చీఫ్ తిరుమావళన్ కూడా ఇప్పుడు కేసీఆర్ వెంట లేరు.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఖమ్మంలో మొదటి బహిరంగ సభను కేసీఆర్ నిర్వహించారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు పినరయి విజయన్, కేజ్రీవాల్, భగవంత్ మాన్ అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా సహా పలువురు నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. వీరిలో ఏ ఒక్కరు కూడా ఇప్పుడు కేసీఆర్ తో , ఆయన పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు. తెలంగాణలో కలిసి పని చేద్దామని కమ్యూనిస్టులను నమ్మించారు. కానీఇప్పుడు కనీసం తలుపులు కూడా తీయడం లేదని ఆ పార్టీ నేతలంటున్నారు.
జాతీయ రాజకీయాల కోసం ఐదేళ్ల నుంచి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. 2017 ఏడాది చివరన, 2018 ప్రారంభంలో అనేక రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంలను, పలు పార్టీల అధినేతలను కలిశారు. జాతీయ స్థాయిలో కలిసి పనిచేద్దామని ఆహ్వానించారు. కానీ ఎవరూ కేసీఆర్ను నమ్మడం లేదు