అది హరియానాలోని అంబాలా – చండీగఢ్ హైవే. హఠాత్తుగా తెల్ల గడ్డంతో ఉన్న ఓ వ్యక్తి ఓ లారీని ఆపాడు. ఆ లారీలో చండీగఢ్ వరకూ వస్తానని ఎక్కాడు. ఆ లారీ డ్రైవర్ కూడా ఎక్కించుకున్నారు. కానీ కాసేపటికే ఆ డ్రైవర్‌కు ఎక్కిన వ్యక్తి్ ఎవరో తెలిసిపోయింది. ఆయనెవరంటే రాహుల్ గాంధీ. అవును కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీనే. ట్రక్ డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు రాహల్ గాంధీ స్వయంగా ప్రజల్లోలికి వెళ్లారు. సోమవారం రాత్రి హరియాణా ని అంబాలా నుంచి చండీగఢ్ వరకు ట్రక్కులో ప్రయాణం చేశారు.
రాత్రిపూట ప్రయాణ సమయంలో భారీ వాహనాల డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు రాహుల్ ఇలా ట్రక్కులో ప్రయాణం చేసినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్న సిమ్లాకు వెళ్తున్న సమయంలో ఇలా ట్రక్‌లో ప్రయాణించినట్లుగా చెబుతున్నారు. ప్రత్యేకంగా ప్లాన్ చేసింది కాకపోవడంతో చూసిన వారు తీసిన ఫోటోలు, వీడియోలు మాత్రమే వైరల్ అవుతున్నాయి.
రాహుల్ గాంధీ భిన్నమైన నాయకుడిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పాదయాత్ర చేసి సంచలనం సృష్టించారు. త్వరలో మరోసారి పాదయాత్ర చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. తరచూ ప్రజలతో మమేకం అయ్యేందుకు ఆయన భిన్నమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇవి ప్రజల మనసుల్ని చూరగొనేలా చేస్తున్నాయి.