అమరావతికి రూ. వెయ్యి కోట్లు ఇవ్వమంటే… యూసీలు అని.. అదని ఇదనీ కొర్రీలు పెట్టి ఇప్పటికీ ఇవ్వలేదు. వెనుకబడిన జిల్లాలకు .. ఇస్తామని చెప్పి రిలీజ్ చేసిన రూ. 450 కోట్లను వెనక్కి తీసేసుకున్నారు. ఇలాంటివి చెప్పుకుంటే ఏపీ పట్ల కేంద్రం వ్యవహరించిన తీరు చూస్తే.. అప్పట్లో అందరికీ కడుపు రగిలిపోయింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టుకుని అయినా డబ్బులిస్తున్నారు. అప్పులిస్తున్నారు.
2 నెలల్లో రూ. పాతిక వేల కోట్లు !
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై.. గట్టిగా రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే కేంద్రం నుంచి రూ. పాతిక వేల కోట్లు అప్పులు, ఇతర రూపంలో వచ్చాయి. పోలవరం నిధులు సహా మరే ఇతర ప్రాజెక్టులకు నిధులు అడగబోమని రాసిచ్చి రూ. పది వేల కోట్ల ప్రత్యేక సాయం తెచ్చుకున్నారు. ఇక అప్పుల పరిమితిలో ఇప్పటికే పదమూడు వేల కోట్లకుపైగా వాడుకున్నారు. ఇలా నిధుల వరద పారుతూనే ఉంది.
తెస్తున్న డబ్బులన్నీ ఏమవుతున్నాయి ?
రాష్ట్రానికి తెస్తున్న ఇలా వేల కోట్ల మనీ ఏమవుతుందన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే.. పెండింగ్ బిల్లులు ఎవరికైనా చెల్లిస్తున్నారా అంటే.. అదీ లేదు. పోనీ అభివృద్ధి పనులు చేస్తున్నారా అంటే అదీ లేదు. డబ్బులన్నీ ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలియదు. సంక్షేమ పథకాల్లో అతి భారీగా ఖర్చయ్యే రెండే రెండు పథకాలు రైతు భరోసా, అమ్మఒడి. ఈ రెండు పథకాలకూ అడ్డగోలు షరతులు పెట్టి లబ్దిదారుల్ని తగ్గించేస్తున్నారు. ఇంకే పథకానికి నియోజకవర్గానికి వెయ్యి మంది లబ్దిదారులు ఉంటే గొప్ప. ఫీజు రీఎంబర్స్ మెంట్ నిర్వీర్యం చేశారు. పథకాల కోసమూ ఈ డబ్బులు వాడటం లేదు. మరి ఎక్కడికిపోతున్నాయి ?
దారి మళ్లిస్తున్నారా ? అప్పులకు రీ పేమెంటా ?
ఖజానాకు చేరుకున్న వేల కోట్ల ఆదాయం దారి మళ్లిపోతోందన్న అనుమానాలు వస్తున్నాయి. అదంతా ఎటు పోతుందన్నదానిపై స్పష్టత లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు మొత్తం ఒకరిద్దరి చేతుల్లోనే ఉంటున్నాయి. లెక్కలన్నీ వారి దగ్గరే ఉంటున్నాయి. అక్కడే అసలు సమస్య వస్తోంది. పూర్తి వివరాలు బయట పెట్టడం లేదు. మొత్తంగా ఆడిట్ జరిగితే ప్రజాధనాన్ని నేరుగా ఎలా దోచుకున్నారో తేలిపోయే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.