సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని బతిమాలుకుంటున్నారు. తనపై దాడికి ఎవరో వస్తున్నారని వారి నుంచి కాపాడాలని బేల అరుపులు అరుస్తున్నారు. వారానికి రెండు సార్లు ఏదో ఓ మీటింగ్ పేరుతో ఊళ్ల మీదకు వెళ్తున్న జగన్ రెడ్డి వాటిని వైసీపీ సమావేశాలుగా ఊహించుకుని ప్రసంగించేస్తున్నారు. మొత్తం రాజకీయ ప్రసంగమే ఉంటోంది. తాను గెలవడం కష్టమంటున్నారని.. ఓ సారి అంటారు. తనపై తోడేళ్ల గుంపు వస్తోందని అండగా నిలబడాలని మరోసారి అంటున్నారు. ఆయన మాటలు.. పెరిగిపోతున్న నిరాశవాదానికి సాక్ష్యంగా ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
తాజాగా ఆయన విద్యా దీవెన పథకం మీట నొక్కడానికంటూ కొవ్వూరుకు వెళ్లిన ఆయన.. ఎన్నికల్లో తనను ఎదుర్కొనేందుకు తోడేళ్లన్నీ ఏకమౌతున్నాయని మంచి జరిగిందని భావిస్తే అండగా నిలవాలని ఏపీ సీఎం జగన్ ప్రజలను కోరారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికి దశ దిశను చూపిస్తుందని సీఎం జగన్ ఆకాంక్షను వ్యక్తం చేశారు. జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాలంటే విద్యతోనే సాధ్యమని సీఎం జగన్ చెప్పారు.
చంద్రబాబు సర్కార్ దోచుకో పంచుకో తినుకో అనే విధంగా వ్యవహరించిందన్నారు. చంద్రబాబు సర్కార్ గజదొంగల ముఠాగా ఏర్పడిందని ఆయన ఆరోపించారు. విద్యార్ధులకు ఫీజలు చంద్రబాబు ఎగవేస్తే వాటిని సైతం తామే ఇచ్చామని చెప్పుకొచ్చారు. అయితే ఫీజు రీఎంబర్స్ మెంట్ పేరును విద్యాదీవెనగా మార్చి.. మూడు నెలలకోసారి ఇస్తామని చెప్పిన ఆయన.. రెండు విడతలు మాత్రమే రిలీజ్ చేస్తూ మిగతా వాటిని వదిలేస్తున్నారు. దీంతో విద్యార్థులే ఆ బకాయిలు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకోవాల్సి వస్తోంది.