కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం చేసిన ఉద్యమం, ఆమరణ నిరాహార దీక్ష వగైరా అన్నీ ఏవిధంగా ముగిసాయో అందరూ చూసారు. మంచి రాజకీయ అనుభవజ్ఞడయిన ఆయన మొదటి నుండి కూడా వరుసగా తప్పులు చేసుకొంటూనే వెళ్ళారు. ఇంకా ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలని నమ్మి తను మోసపోయాయని, మార్చి 10లోగా తనకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలుచేయకపోతే మళ్ళీ ఆమరణ నిరాహార దీక్షకి కూర్చొంటానని ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే అందుకు ఆయన ఎంచుకొన్న సమయం, లేఖలో ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం వలన ప్రభుత్వానికి ఆయనను విమర్శించే అవకాశం దక్కింది.
తెదేపా, వైకాపాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ఆయన మళ్ళీ ప్రభుత్వానికి కొత్త డెడ్ లైన్ పెట్టడంతో, ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రోద్భలంతోనే ఆవిధంగా చేసి ఉంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేసారు. ఆయన జగన్ చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయ దుర్దేశ్యంతోనే ప్రభుత్వాన్ని డ్డీకొంటున్నారని ముఖ్యమంత్రి అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇదివరకు ఆమరణ నిరాహార దీక్ష విరమిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా మాట్లాడినందుకు క్షమాపణలు కోరిన ముద్రగడ ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి తనను మోసం చేసారని ఆరోపించడం కూడా ఆయన నిబద్దతను శంకించేలా చేస్తోంది. ఆయన లక్ష్యం కాపులకు రిజర్వేషన్లు సాధించడమా లేక జగన్మోహన్ రెడ్డి సందించిన అష్ట్రంగా మారి ముఖ్యమంత్రిని డ్డీ కొనడమా? అనే అనుమానం కలుగుతోంది. ఆయన లక్ష్యం కాపులకు రిజర్వేషన్లు సాధించడమే అయితే తెదేపా, వైకాపాలకు మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆయన పావుగా మారనవసరం లేదు. ఆమరణ నిరాహార దీక్ష ముగించేటప్పుడు ప్రభుత్వంతో చేసుకొన్న ఒప్పందం ప్రకారం అన్నీ సరిగ్గా అమలవుతున్నాయా లేదా? అని మాత్రమే చూసుకొంటే సరిపోతుంది.
ఒకవేళ మళ్ళీ ఆయన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోన్నట్లయితే ఈసారి అభాసుపాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు ఆయన ఎవరినీ సంప్రదించకుండా నేరుగా ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడేసుకొని అర్ధాంతరంగా తన దీక్షను విరమించేయడంతో ఆయనకు మద్దతు ఇస్తున్న కాపు నేతలు షాక్ అయ్యారు. దీక్ష విరమణ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడుకి క్షమాపణలు చెప్పడం, కాపులకు రిజర్వేషన్లు ఇస్తే ఆయన కాళ్ళు కడుగుతానని చెప్పడం ఆయన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోయారు. కనుక ఈసారి ఆయన దీక్షకి కూర్చొంటే కాపులు అందరూ ఆయనకు అండగా నిలుస్తారో లేదో అనుమానమే. చీటీకి మాటికీ నిరాహార దీక్షలు చేస్తానంటూ ప్రభుత్వాన్ని బెదిరిస్తుంటే ప్రభుత్వం కూడా ఈసారి కటినంగానే వ్యవహరించవచ్చును. కనుక ముద్రగడ పద్మనాభం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ముందుకు వెళ్లి మళ్ళీ భంగపడటం కంటే, కాపు నేతలతో చర్చించుకొని వారి సూచనలు, అభిప్రాయాల మేరకు అడుగు ముందుకు వేస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.