చాలా వారాల కిందటే ఏపీలో టీవీ9 రెండో స్థానంలోకి వెళ్లిపోయింది. ఎన్టీవీ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. మళ్లీ చాలా వారాల తర్వాత టీవీ9 ఒక్క పాయింట్ తేడాతో నెంబర్ వన్ ప్లేస్ లోకి వచ్చింది. అంతే టీవీ9 సంబరాలు హద్దులు దాటిపోయాయి. వాళ్ల స్టూడియోలో సంబరాలు.. ఆ ఫీట్ సాధించడానికి తాము ఎంత ప్రతిభా ప్రదర్శన చేయాల్సి వచ్చిందో కథలు కథలుగా ప్రజలకు వివరించారు. అంత వరకూ బాగానే ఉంది..కానీ కొత్తగా రోడ్లపై ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది టీవీ నైన్. డివైడర్ల మధ్య ఉండే హోర్డింగ్స్ పెట్టింది.
తాము నెంబర్ వన్ వచ్చామని చెప్పుకోవడం కాకుండా.. కుట్ర ద్వారా నెంబర్ వన్ వచ్చిందన్న అర్థంలో పెట్టుకుని అది ఎక్కువ కాలం ఉండదని చెప్పుకొచ్చారు.. పోటీ చానల్ పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడంతో టీవీ9కే ఆ పొజిషన్ కుట్ర ద్వారా వచ్చిందని చెబుతున్నారేమో.. అది ఎక్కువ కాలం నిలబడదని చెబుతున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది. అయితే అది కాదని.. టీవీ9నే.. ఎన్టీవీని మాక్ చేస్తోందని కొంత మంది చెబుతున్నారు. కారణం ఏదైనా ఆ రెండు మీడియా చానల్ల మధ్య వార్ రోడ్డున పడినట్లయింది.
కొసమెరుపేమిటంటే.. ఈ పోస్టర్లపై ప్రజాప్రయోజనార్థం పెట్టినట్లుగా చెప్పుకున్నారు. ఈ రెండు టీవీ చానళ్లు.. ప్రజాప్రయోజనాలను ఎప్పుడో గాలికి వదిలేసి.. తమ యజమానులు.. వారికి మేళ్లు చేసే అధికార పార్టీలకు బాకా ఊదుతూ.. ప్రజల కోసం పోరాటాలు చేసే విపక్ష నేతలపై బురద చల్లడం ప్రారంభించి చాలా కాలం అయింది. అందుకే ఈ రెండు చానల్స్ ను చాలా పార్టీలు బ్యాన్ చేశాయి. విచిత్రంగా వార్తల విషయంలో ఇద్దరూ ఒకటే.. కానీ.. పోటీ మాత్రం.. రోడ్డున పడుతోంది. ఇది ఇంతటితో ఆగేలా లేదని.. ముందు ముందు ఈ కోల్డ్ వార్ మరింత ముదురుతుందని .. మీడియా వర్గాలు చెబుతున్నాయి.