ఆంధ్రప్రదేశ్‌లో రోజూ జరుగుతున్న పరిణామాలు చూస్తున్న ఎవరికైనా .. దేశంలో రాజ్యాంగం, వ్యవస్థలు పని చేస్తున్నాయా అనే అనుమానం రావడం సహజం. అక్కడి ప్రజలెవరికి హక్కులు లేవు. తన జీవితం తాము గడిపే స్వేచ్చ లేదు. చట్టబద్దంగా చేసుకున్న ఒప్పందాలకు రక్షణ లేదు. నోరెత్తితే ఎగబడే గూండాలు.. వారికి మద్దతుగా విరుచుకుపడే పోలీసులు ఇలా ఎక్కడ చూసినా సొంత లా అండ్ ఆర్డర్ అమలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బాధితులు పెరిగిపోతున్నారు. దౌర్జన్యాలే రోజువారీ కార్యక్రమాలుగా మారిపోయాయి. వ్యవస్థలన్నీ అలా చూస్తూండిపోతున్నాయి.
అమరావతిలో అలా – కర్నూలులో ఇలా !
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆస్పత్రి ఉన్న గాయత్రి ఎస్టేట్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అవినాష్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. కార్పెట్లు వేసుకుని కూలర్లు పెట్టుకుని విందులు చేసుకుంటున్నారు. అటు వైపు ఎవర్నీ రానివ్వడం లేదు. పోలీసులు కూడా వారిని ఏమీ అనడం లేదు. ఎలాంటి 144 సెక్షన్ విధించలేదు. వారికి రక్షణ కల్పిస్తున్నారు. మరో వైపు అమరావతిలో తమ దీక్షా శిబిరంలో ఉన్న రైతులపై డీఎస్పీ పోతురాజు చేసిన దౌర్జన్యం కళ్ల ముందు కనిపిస్తోంది. అక్కడ 144 సెక్షన్ విదించారు. కర్నూలులో పరిస్థితుల్ని, అమరావతిలో పరిస్థితుల్ని బేరీజు వేసి జనం నోళ్లు నొక్కుకుంటున్నారు.
హత్య కేసు నిందితుడు ఆస్పత్రిలో దాక్కుంటే రక్షణ కల్పించే వ్యవస్థ !
హత్య కేసు నిందితుడు ఆస్పత్రిలో దాక్కుంటే రక్షణ కల్పించడం అంటే.. అంత కంటే దిగజారిపోయిన వ్యవస్థ ప్రజాస్వామ్యంలో ఉండదు.కానీ ఏపీలో ఉంది. సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆస్పత్రిలోపల షెల్టర్ తీసుకుని బయట రౌడీమూకల్ని అడ్డుగా పెట్టుకున్న అవినాష్ రెడ్డి తీరుపై.. మరింత సీరియస్ అయి కఠిన చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థలు.. మిన్నకుండిపోతున్నాయి. సహకరిస్తున్నాయి.
ఏపీ భవిష్యత్ ను తాకట్టు పెట్టేసే పాలన
ఓ వైపు అరాచకం..మరో వైపు ఏపీ భవిష్యత్ ను తాకట్టు పెట్టేసి తెచ్చిన స్వల్ప మొత్తాలతో బటన్లు నొక్కేసి…శాశ్వతంగా ఏపీకి ఎలాంటి మేలు జరగకుండా.. అభివృద్ధి చెందకుండా చేసే కుట్రలను పూర్తి చేసేశారు. ఏపీ కోసం ఇక ఎలాంటి నిధులు అడగబోమని రాసిచ్చి పదివేల కోట్లు తెచ్చుకున్న ప్రభుత్వం జల్సాలు ప్రారంభించింది.కానీ రేపేమిటన్న అంశంపై మాత్రం ఎవరికీ చింత లేదు. మొత్తంగా రాష్ట్రం సర్వ నాశనం అయిపోయింది. ప్రజలకు పప్పు బెల్లాలు పంచుతున్నాననే పేరు చెప్పి.. ఎంత నాశనం చేయాలో అంతా చేశారు… అది వ్యవస్థల పరంగా..ఇటుప్రజల జీవితల పరంగా.