అటు కాంగ్రెస్ తో కలవలేరు.. ఇటు బీజేపీని వ్యతిరేకించలేరు అనే పరిస్థితికి కేసీఆర్ జారిపోయారన్న అభిప్రాయం జాతీయ రాజకీయాల్లో వినిపిస్తోంది. బీజేపీని గద్దె దించి తాను ఢిల్లీ పీఠం ఎక్కేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపించారు. కానీ ఢిల్లీ వైపు చూడటం లేదు. ఆయనను ఇతరులూ పిలవడం లేదు. బీజేపీని దింపేందుకు కలిసి పని చేద్దామని.. ప్రత్యేక విమానంలో చాలా రాష్ట్రాలకు వెళ్లిన కేసీఆర్ను ఇప్పుడు విపక్షాలు ఏకమైనా పిలువడం లేదు.
ప్రస్తుతం జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలు వివిధ అంశాలపై పోరాడుతున్నాయి. అందులో మొదటిది ఢిల్లీ అధికారాలను తగ్గించేందుకు కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్. మరొకటి.. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం. ఇలాంటి అంశాలపై రాజకీయ పార్టీలన్ని కలిసికట్టుగా పోరాడుతున్నాయి. ఈ పోరాటాలే భవిష్యత్ రాజకీయాలకు.. విపక్షాల కూటమికి.. ఈ అంశం ఓ వేదికగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బీజేపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఈ విషయంలో ఆ పార్టీలతో కలవడం లేదు. గతంలో రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేసినప్పుడు.. కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహించిన సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి కేసీఆర్ ఆసక్తి చూపించకపోవడం వల్లనే ఇతర పార్టీలు పిలవడం మానేశాయన్న అభిప్రాయాలు వినిపిస్తోంది. విపక్షాల కూటమిని పటిష్టం చేయాలన్న లక్షంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరుసగా విపక్ష నేతలను కలుసుకుని చర్చిస్తున్నారు. ఆయన కేసీఆర్ ను కలుస్తానని చెప్పినప్పటికీ ఇప్పటి వరకూ కలవలేదు. ఆయన కలవడానికి సిద్ధమే కానీ.. కేసీఆరే ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి ..అంతకు ముందు స్టాలిన్ పుట్టిన రోజు వేడుకలకూ కేసీఆర్కు ఆహ్వానం అందలేదు. దీంతో కేసీఆర్ ఇప్పటి వరకూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆయన ఒంటరిగా మిగిలిపోయారన్న వాదన వినిపిస్తోంది.