అమరావతిలో ఇళ్ల స్థలాలకు బందోబస్తు అంటూ ప్రకాశం జిల్లా నుంచి పిలిపించినన పోలీసులకు కనీస ఏర్పాట్లు చేయలేదు.దాంతో అక్కడ పొదల్లోనే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా పాముకాటుకు గురైన కానిస్టేబుల్ పవన్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. ఆర్-5 జోన్ లో బందోబస్తు విధుల కోసం ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన కానిస్టేబుల్ పవన్ కుమార్… రాత్రి వేళ తుళ్లూరు మండలం అనంతవరం ఆలయం వద్ద ఇతర కానిస్టేబుళ్లతో పాటు విశ్రమించారు. నిద్రిస్తుండగా పాము కాటు వేయడంతో, ఆయన పామును పట్టుకుని ఇవతలికి లాగారు. దాంతో పాము చేతిపై కూడా కాటు వేసింది.
వెంటనే పోలీసులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించలేదు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో చివరి ప్రయత్నంగా మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ పవన్ కుమార్ మృతి చెందారు. ఈ అంశంపై ఇప్పుడు పోలీసు వర్గాల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది. ఇతర ప్రాంతాల్లో బందోబస్తుకు వెళ్లిన వారికి కనీస సౌకర్యాలు కల్పిస్తూంటారు. అయితే రాజధాని ప్రాంతంలో మాత్రం కనీస సౌకర్యాలు కల్పించలేదు. చిన్న చిన్న గుళ్లూ, ఇతర కట్టడాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది.
చివరికి పాముకాటుకు గురైన కానిస్టేబుల్ ను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయాలన్న ఆదేశాలు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో పరిస్థితి విషమించింది. ఇక లాభం లేదని తేలిన తర్వాత విమర్శలు వస్తాయేమోనని హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ కార్పొరేట్ వైద్యం అందించినా చనిపోయారన్న అభిప్రాయం కల్పించడానికి ప్రయత్నించారు. ఇదంతా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తమవుతోంది.
ఈ ప్రభుత్వం పోలీసులను సొంత సైన్యంగా వాడుకోవడం తప్పి.. వారికి ఇవ్వాల్సిన జీత భత్యాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రెండేళ్ల తర్వాత ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే.. అదేదో సాయం అన్నట్లుగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పి వచ్చారు పోలీసు సంఘం నేతలు. కానీ ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతూంటే ఎవరూ స్పందించడం లేదన్న అసహనం కొంత మందిలో కనిపిస్తోంది.