అమెరికా అందాల భామల్లోనూ ఆంధ్రా పచ్చడి రుచి అంటే పడిచచ్చే వాళ్లు చాలా మందే ఉన్నారట. మొన్న ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డ్ గెల్చుకున్న బ్రీ లార్సన్ కు ఆంధ్రా పచ్చళ్లంటే చాలా ఇష్టమట. టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మి అమెరికాలోని లాస్ ఏంజిలిస్ లో ఉన్నప్పుడు బ్రీతో పరిచయం ఏర్పడింది. కాబట్టి ఆమె పచ్చళ్ల అభిరుచి గురించి లక్ష్మి వివరించారు. తాము అప్పట్లో ఎక్కువగా తిండి గురించే మాట్లాడుకునే వాళ్లమని, ఆంధ్రా పచ్చళ్లను ఆమె తెగ లాగించేసేదని చెప్పారు. అన్నట్టు వీరిద్దరూ కలిసి ఇప్పుడు బాస్మతీ బ్లూస్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్లో తీసుకున్న ఫొటోలను మంచు లక్ష్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అన్నింటిలోకెల్లా గోంగూర, చింతకాయ పచ్చడి అంటే బ్రీకి మరీ మరీ ఇష్టమట. తన సోదరుడి పెళ్లికి వచ్చిన బ్రీ, కొన్ని పచ్చళ్లకు కూడా తీసుకెళ్లిందని లక్ష్మి వివరించారు.
కాలిఫోర్నియాకు చెందిన బ్రీ, 26 ఏళ్ల వయసులోనే ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకుని యావత్ ప్రపంచాన్ని విస్మయపరిచింది. తొమ్మిదేళ్ల వయసులోనే మ్యూజిక్ కెరీర్ ను ప్రారంభించింది. నటిగా అత్యున్నత కీర్తి కిరీటాలను అధిరోహించింది. ఆమెకు అందమైన బాల్యం లేదు. చిన్నతనం నుంచీ జీవితం ఒక సంఘర్షణే. ఎవరూ బొమ్మలు కొనివ్వలేదు. తండ్రి ప్రేమకు నోచుకోలేదు. రెండు షర్టులు, రెండు జీన్స్ ప్యాంట్లతో కాలం వెళ్లదీసిన రోజులున్నాయట. గత పదేళ్లలో ఒక్కసారిగా తండ్రిని చూడలేదు, మాట్లాడలేదు. 1995లోనే తండ్రి వీరి కుటుంబంతో తెగతెంపులు చేసుకున్నాడు. అయినా బ్రీ ధైర్యం వీడలేదు. అధైర్య పడలేదు.
జీవితాన్ని చాలెంజ్ గా తీసుకుని విజయ పథంలో దూసుకుపోతున్న బ్రీ, చాలా మందికి స్ఫూర్తి ప్రదాత అని అమెరికా మీడియా ప్రశంసించింది.
రూమ్ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు నీరజనాలు పట్టారు. ఆమె ప్రదర్శించిన హావభావాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. అందుకే, ఎంతో మంది మహామహులైన నటీనటులకే జీవితాంతం ప్రయత్నించినా దక్కని ఆస్కార్ పురస్కారం ఆమెకు చిన్న వయసులోనే సొంతమైంది. ప్రతిభకు పదును పెట్టుకుంటూ, జీవన పోరాటంలో రోజూ గెలవాలని ఆరాటపడిన ఈ యువతి మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తుందంటూ అమెరికాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.