” మేనిఫెస్టోలో పెట్టిన హామీల్ని 98.5 శాతం అమలు చేశాం. మళ్లీ రీ సౌండింగ్ విక్టరీ మాదే ” అని సకల శాఖల మంత్రి, అనధికారిక సీఎం , ప్రభుత్వానికి, వైసీపీకి కళ్లు, ముక్కూ, చేతులూ, కాళ్లు కూడా అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గెలిచి నాలుగేళ్లయిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. నేరుగా సీఎం జగన్ మీడియా ముందుకు వచ్చి చెప్పి ఉంటే వేరుగా ఉండేది..కానీ ఆయన మీడియా ముందుకు రావాలంటే.. గంట రిహార్సల్స్ చేయాలి.. అరగంట రికార్డింగ్ చేయాలి. ఆయన డిఫర్డ్ లైవ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తిప్పలన్నీ ఎందుకని తన మౌత్ పీస్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని మీడియా ముందుకు పంపుతూంటారు. అంత వరకూ బాగానే ఉన్నా.. హామీలన్నీ నెరవేర్చారా లేదా అన్న వాదనల్ని పక్కన పెట్టినా.. అసలు రెండో సారి గెలిచారే అనుకుందాం.. అప్పుడు ఏం చేస్తారు ? . ఏం చేయగలరు ?. ఏమీ చేయడానికి లేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని ఇప్పటికే బొంద పెట్టేశారు. తాకట్టు పెట్టేశారు. అప్పుల పాలు చేశారు. పరిశ్రమల్ని తరిమేశారు. తాత్కలిక ప్రయోజనాల కోసం మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశారు. చివరికి తాము ఇప్పుడు నొక్కుతున్న బటన్లు కూడా నొక్కలేరు. ఎందుకంటే అప్పులు కూడా ఇక పుట్టవు మరి. మళ్లీ గెలిచి ఏం చేస్తారు ?
నాలుగేళ్లలో పేదల జీవితాలు దర్భరం !
ప్లేటు నిండా పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి ఇస్తే.. తినకుండా ఎదుటి వాడు పెరుగన్నం తింటున్నాడని వాడి పళ్లేన్ని నెట్టేసేందుకు తన ప్లేటును కూడా నెట్టేసుకునే వ్యక్తిత్వం ఉన్నవాళ్లు చాలా మంది ఉంటారు. ఇలాంటి వాళ్లు ప్రజల్ని… వారి జీవితాల్ని ప్రభావితం చేసే స్థాయికి వస్తేనే సమస్య. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు చూసిన ఎవరికైనా ప్రజలు ఇన్ని కష్టాలు ఎందుకు పడాల్సి వచ్చిందన్న అబిప్రాయం ఎవరికైనా వస్తుంది. నాలుగేళ్ల కిందట రేషన్ బియ్యాన్ని .. ఎప్పుడు కావాసంటే అప్పుడు దుకాణం దగ్గరకు వెళ్లి తెచ్చుకునేవారు. కానీ ఇప్పుడు డోర్ డెలివరీ పేరుతో ఒకటి రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. డోర్ డెలివరీ పేరుకే.. ఊరవతలో.. కాలనీలోనే ఎక్కడో వాహనం నిలబెడితే అక్కడకు వెళ్లి తెచ్చుకోవాలి. రేషన్ దుకాణాలు కూడా అంతకు ముందు అటూ ఇటూగానే ఉంటాయి. మరి ఈ వ్యవస్థ ఎందుకు ? ఎందుకు అంటే.. పాలకుల పిచ్చి ఆలోచనలకు ప్రతిరూపం అనుకోవాలి. ఇది ఒక్కటి కాదు.. పెన్షన్ నిరుపేదలకు ఇచ్చేది రూ. రెండున్నర వేలు అయితే.. దాన్ని ఇచ్చే వాలంటీర్ కు నెలకు ఐదు వేలు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దశలోనూ దుబారానే. అసలు గ్రామ పంచాయతీలు ఉండగా.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఎందుకో ఎవరికీ అర్థం కాదు. మా అధికారాలన్నీ లాగేసుకున్నారని పంచాయతీలు గగ్గోలు పెడుతున్నాయి. ఇలా వ్యవస్థలన్నింటినీ.. ముఖ్యంగా పేద ప్రజల జీవితాల్ని సులువు చేస్తున్నామన్న పేరుతో మరింత దుర్భరంగా మార్చిన పాలన నాలుగేళ్లుగా సాగుతోంది. ఇలాంటి స్థితిలో మళ్లీ గెలిచి ఏం చేస్తారు ?
పేద కుటుంబాల్ని అప్పుల పాలు చేసిన పాలన !
నా పేదలు..నా పేదలు అని జగన్ అంటూ ఉంటారు. కానీ ఆ పేదల్ని సీఎం జగన్ ఎంత దోచుకున్నారన్నదానికి కళ్ల ముందే స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వారిని అప్పుల పాలు చేస్తోంది. ఏపీలో మద్యం తాగే వారంతా పేదలే. మధ్యతరగతి, ఉన్నత స్థాయి వర్గాలు ఆ బ్రాండ్లు తాగవు. ప్రభుత్వానికి లభిస్తున్న రూ. పాతిక వేల కోట్ల మద్యం ఆదాయం ఆ పేద ప్రజల సొమ్మే. ఓ రోజు కూలీ లేదా చిరు వ్యాపారి రోజంతా కష్టపడితే ఓ రూ .వెయ్యి సంపాదించుకోగలుగుతారు. ఆ వెయ్యిలో మద్యం అలవాటు ఉన్న వ్యక్తి.. రూ. ఐదువందలు ప్రభుత్వానికి సాయంత్రానికి టాక్స్ చెల్లిస్తాడు. అంటే సగం ఆదాయాన్ని ప్రభుత్వానికే ధారబోస్తున్నాడు. నిజానికి ఏపీలో రోజుకు వెయ్యి కూడా సంపాదించలేని కుటుంబాలే ఎక్కువ. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను ఏపీ సర్కార్ అప్పుల పాలు చేసింది. రూ. పది, ఇరవై వేలు కడితే.. గతంలో ఇళ్ల లబ్దిదారులపై ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు. ముఫ్పై ఏళ్ల కిందట తీసుకునన్న రుణాలను కూడా ముక్కు పిండి వసూలు చేశారు. నిజానికి వారంతా నిరుపేదలు.. రెక్కాడితే డొక్కాడనివారు. ఇళ్లకు పూర్తిగా రుణం ఇవ్వకపోయినా.. ఇప్పటికి ఉండటానికి ఇల్లు లేకపోయినా … వారిని వదిలి పెట్టలేదు. డబ్బులిచ్చి ప్రైవేటు సైన్యంలా పోషిస్తున్న వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, పోలీసులు ఇలా ఓ గుంపును.. పేదల ఇళ్లపైకి పంపి.. బెదిరించి మరీ వసూలు చేశారు. ఇవ్వలేని వారికి అప్పులు ఇప్పించారు. ఇలా ఓటీఎస్ పేరుతో పేదల ను అప్పుల పాలు చేశారు. ముఫ్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలంటూ. కనీసం రూ. పదిహేను వేల కోట్లు పెట్టి.. పనికి రాని స్థలాలను వైసీపీ నేతల వద్ద నుంచే కొనుగోలు చేశారు. కానీ లబ్దిదారులకు ఇచ్చేది సెంటు భూమి. అంటే 40 గజాలు మాత్రమే. అందులో ఎంత ఇల్లు వస్తుందో కనీస అవగాహన ఉన్నవారికైనా తెలుస్తుంది. ఈ ఇళ్ల కోసం కేంద్రం ఇచ్చే రూ. లక్షా ఎనభై వేలును మాత్రమే రాష్ట్రం ఇస్తోంది. అంతే కానీ సొంతంగా రాష్ట్రం పైసా ఇవ్వడం లేదు. స్థలం ఇచ్చాం కదా అంటోంది. ఈ రోజుల్లో రూ. లక్షా ఎనభై ఐదు వేలకు.. పునాదులు కూడా వేయలేరు. ఇల్లు ఎంత సాదాసీదాగా కట్టుకోవాలన్నా మరో మూాడు, నాలుగు లక్షల ఖర్చు అవుతుంది. పేదలందర్నీ ఇళ్లు కట్టుకోకపోతే ఇచ్చిన స్థలం కూడా క్యాన్సిల్ చేస్తామని బెదిరించి.. ఎక్కడెక్కవన్నీ అప్పులు చేసి మరీ ఇల్లు కట్టుకునేలా చేస్తున్నారు. ఇలా స్థలాలు పొందిన లబ్దిదారుల్లో లక్షల మంది ఇప్పటికే లక్షల రూపాయల అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటున్నారు. ఇందులో విషాదం ఏమిటంటే.. ప్రభుత్వమే డ్వాక్రా పేరుతో రూ. ముఫ్పై ఐదు వేలు లోను ఇప్పించడం. ఇలా ప్రజల్ని అప్పుల పాలు చేయడానికి.. మళ్లీ గెలిచి ఏం చేస్తారు ?
దేశంలోనే అత్యధిక పన్నులున్న రాష్ట్రం !
దేశంలోనే అత్యధికంగా పన్నులు ఉన్న రాష్ట్రం ఏపీ. పెట్రోల్, డీజిల్ రేట్లు పొరుగు రాష్ట్రం కన్నా పది రూపయాలు ఎక్కువ. ఎక్కువ పేదలు ఉన్నది కూాడ ఏపీలోనే. అలాంటప్పుడు తక్కువ ధర ఉండాలి. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజల్ని పన్నుల రూపంలో పీడించేసి వసూలు చేస్తోంది. చెత్త పన్నుల వసూలు కోసం .. ప్రభుత్వం చేస్తున్న విన్యాసాలు చూసి.. అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిత్యావసరాల వస్తువుల బడ్జెట్.. ఏడాదిలో రెట్టింపయింది. కానీ ప్రజల ఆదాయం మాత్రం పెరగలేదు. ఓ వైపు ఉపాధి తగ్గిపోవడం.. మరోవైపు పన్నుల మోతతో.. ఎవరికీ ఊపిరిఆడకుండా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దిగువ మధ్యతరగతి ప్రజల బతుకులు బాగుపడ్డాయి. కానీ ఏపీ పేదల పరిస్థితే దిగజారింది. దీనికి ద్విచక్రవాహనాల అమ్మకాలు దారుణంగా పడిపోవడమే సాక్ష్యం. ముఖ్యంగా ఓటు బ్యాంకుల్ని పూర్తిగా నిరుపేదల్ని చేసి వారికి మరో ఆప్షన్ లేకుండా ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం ఎదురు చూసేలా చేసి .. రెండు ముద్దలు పెట్టి ఆకలి తీర్చే.. తామే దేవుళ్లమని.. తాము లేకపోతే.. ఆ రెండు ముద్దలు కూడా దక్కవని భయపెట్టడమే ప్రస్తుత రాజకీయ లక్ష్యం. ఆ జాబితాలోకి మెజార్టీ ప్రజల్ని చేర్చడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నాలే లేవు. నిరుపేదల్ని మరింత దారిద్ర్యంలోకా మళ్లీ గెలిచేది ?
బటన్లు నొక్కడానికి …తాకట్టు పెట్టడానికి ఏమన్నాయి ?
ఈ నాలుగేళ్ల కాలంలో బటన్లు నొక్కడానికి వచ్చే పాతికేళ్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు. ప్రజల రక్తాన్ని పీల్చే మద్యం అమ్మకాలు మరో ప్రభుత్వం వచ్చినా తగ్గించకుండా ఉండేలా పాతికేళ్లకు తనఖా పెట్టి అప్పు తెచ్చారు. విశాఖ రాజధాని పేరుతో కలెక్టరేట్ సహా అన్నీ అప్పులు చేశారు. చివరికి కేంద్రం నుంచి ఇంకేమీ అడగబోమని రాసిచ్చి రూ. పది వేల కోట్లు తెచ్చుకున్నారు. అంటే ఇక ఏపీకి వచ్చే ఆర్థిక వనరులేం లేవన్నమాట. అన్నీ వాడేశారు. ఇక ప్రజా ఆస్తులను.. ప్రత్యేక జీవ ద్వారా ప్రభుత్వ పరిధిలోకి తీసుకు వచ్చి నగరాలకు నగరాలు..ఊళ్లకు ఊళ్లు తాకట్టు పట్టడమే మిగిలింది. మళ్లీ గిలిచి ఏం చేస్తారు ?
ఒక్క పరిశ్రమైనా తెచ్చారా ? ఒక్క అభివృద్ధి అయినా చేశారా ?
పచ్చగా ఉండే రాష్ట్రాన్ని వల్లకాడు చేసినట్లుగా చేసేశారు. ఎంత దారుణం అంటే అమెరికాలో స్థిరపడి సొంత ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని అమెరికా నుంచి వచ్చి పెట్టుబడులు చిత్తూరు జిల్లాలో వేల కోట్లతో పరిశ్రమలు పెట్టి ప్రపంచస్థాయి బ్రాండ్ అను అభివృద్ధి చేసి ప్రజలకు అండగా నిలిచిన పరిశ్రమ.. తమ కొత్త ప్లాంట్ ను చిత్తూరులో పెట్టడానికి భయపడిపోయింది. ఏ లక్ష్యంతో వచ్చారో ఆ లక్ష్యాన్ని వదిలేసి తాము బతికుండా చాలు బతుకు జీవుడా అనుకుంటూ పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయింది. ఇలాంటి వాతావరణంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఒక్కరైనా పెట్టుబడులు పెడతారా ?. నాలుగేళ్ల కాలంలో పులివెందులలో కుక్కలకు వేసే వ్యాక్సిన్ల పరిశ్రమ దగ్గర నుంచి ఇంటిలిజెంట్ సెజ్ అని.. మరొకటని ఎన్ని కబుర్లు చెప్పారో లెక్కే లేదు. కానీ ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా గ్రౌండ్ కాలేదు. ఉపాధి దొరకలేదు. కానీ గత ప్రభుత్వం కృషితో వచ్చిన పరిశ్రమలన్నింటినీ వెళ్లగొట్టారు. వేల కొద్ది ఉద్యోగాలిచ్చి రిలయన్స్ సెజ్, లూలూ మాల్, ప్రకాశంలో పేపర్ ఇండస్ట్రీ ఇలా చెప్పుకుంటూ పోతే..రాష్ట్ర యువత భవిష్యత్ మార్చే అన్ని పరిశ్రమల్ని తరిమేసి వారి భవిష్యత్ ను అంధకారం చేశారు. ఈ విషయం యువతకు తెలుస్తుందా లేదా అన్న విషయం పక్కన పెడితే .. పాలన చేతికి ఇచ్చింది మాత్రం ఖచ్చిందా వారి బతుకులు బాగు చేస్తారనే .. చెడగొడతారని కాదు. ఒక్క అభివృద్ధి పని లేదు. మూాడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేశారు. దీని వల్ల ఎవరికి నష్టం జరిగింది. వ్యక్తులకు జరిగింది కాదు.. జరిగింది రాష్ట్రానికి .. రాష్ట్ర ప్రజలకు. పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టేశారు. ఎవరికి నష్టం. సాధారణంగా ఓ పది లక్షలతో కట్టే ఇల్లును ఓ ఏడాది అపిదేనే తర్వాత పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది.అలాంటిది నాలుగేళ్ల పాటు పోలవరం ప్రాజెక్టును పండబెడితే ఎవరికి నష్టం. ఇప్పుడు ఆ ప్రాజెక్టును నాలుగేళ్ల పాటు పనులు ఆపేయడం వల్ల ఎవరికి నష్టం. జగన్ కు రూపాయి నష్టం ఉండదు. అంతా రాష్టానికే నష్టం. దీన్ని ప్రజలు గుర్తిస్తారా లేదా అన్నసంగతి పక్కన పెడితే.. పాలకుడికి మనస్సాక్షి అనేది ఉండదా ?. నాశనం చేసేశానే అని బాధపడరా ?. . ఎప్పుడు చూసినా పనులు పరుగులు పెడుతున్నాయని చెబుతూంటారు..అంత పరుగులు పెడితే నాలుగేళ్లలో ఎందుకు పూర్తి కావు. ఏపీ ఊపిరిని పూర్తిగా నొక్కేశారు. ఏపీలో ఎక్కడా మౌలిక సదుపాయాలు కూడా లేవు. అభివృద్ధి పనులు లేవు. మొత్తం ఏపీని సర్వనాశనం చేసేశారు. మళ్లీ గెలిచి ఏం చేస్తారు ?
పోనీ జనాన్ని అయినా ప్రశాంతంగా బతకనిచ్చారా ?
ఇవన్నీ కాదు.. పోనీ జనాల్ని అయినా ప్రశాంతంగా బతకనిచ్చారా అంటే.. ప్రతీ రోజూ ఏదో అలజడి పెట్టుకోవడమే. అధికారం దొరికిందని పగ, ప్రతీకారారాతో ఇష్ట రీతిన వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి.. పోలీసు వ్యవస్థను చులకన చేశారు. ఎంతో మందిని అరెస్ట్ చేశారు. ఒక్కరిపైనా కేసులు ఎందుకు నిరూపించలేకపోయారు. సోషల్ మీడియాకేసుల్ని పెట్టి అర్థరాత్రిళ్లు తలుపులు బద్దలు కొట్టించి అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుందోనని భయపెట్టేందుకు ఎంతకైనా దిగజారారు. ప్రైవేటు ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. నిందితులకు రక్షణ.. బాధితులకు అరెస్టులకు నజరానాగా ఇచ్చారు. ఒకప్పుడు బీహార్ గురించి ఎలా చెప్పుకున్నారో ఇప్పుడు ఏపీ గురించి ఎలా చెప్పుకుంటున్నారు. మరి మళ్లీ గెలిచి ఏపీని ఏం చేయాలనుకుంటున్నారు ?