బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కొత్త పార్లమెంట్ భవనం అంశం చిక్కులు తెచ్చి పెడుతోంది. ప్రారంభోత్సవానికి వెళ్లాలా వద్దా అని కిందా మీదా పడుతున్నారు. వెళ్లకపోతే బీజేపీ వ్యతిరేక ముద్ర పడుతుంది. అది ఇష్టం లేదు. అదే ఇష్టం అయితే .. ఆయన సైలెంట్ అయ్యేవారు కాదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లకూడదని భావిస్తున్నారు. అలా అని అనుకూల ముద్రకు కూడా సిద్ధంగా లేరు. బీజేపీపై ఆరివీర భయంకరమైన యుద్ధం ప్రకటించి ఇప్పుడు పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి వెళ్తామంటే అది పాజిటివ్ ముద్ర వేస్తుంది.
వెళ్తే బీజేపీ అనూకల ముద్ర.. వెళ్లకపోతే బీజేపీకి కోపం … ఈ రెండింటి మధ్య కేసీఆర్ నలిిపోతున్నారు. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విపక్ష పార్టీలు.. రాబోవడం లేదని ప్రకటించేశాయి. మిగతా పార్టీలు చాలా వరకూ వెళ్తామని ప్రకటించాయి. బీజేడీ, టీడీపీ, వైసీపీ అన్నీ వెళ్తామన్నాయి. కానీ ఎటూ తేల్చుకోలేకపోతోంది మాత్రం బీఆర్ఎస్ పార్టీనే. ఈ అంశంపై ఆ పార్టీ నేతలకు స్పష్టత లేకపోవడంతో.. వారెవరూ మాట్లాడటం లేదు. చివరికి ఇలాంటి అంశాలపై దూకుడుగా స్పందించే కవిత కూడా కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందించడం లేదు.
ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఎడ్జ్ లో ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కవితను అరెస్ట్ చేయడానికి అధికారం ఉంది. ఆమెపై తరచూ సుకేష్ చంద్రశేఖర్ లీకులు ఇస్తున్నారు. ఏ యే కంపెనీల నుంచి డబ్బులు మనీలాండరింగ్ చేశారో కూడా చెబుున్నారు. ఇవన్నీ వ్యూహాత్మకంగా బయటకు వస్తున్నాయని.. కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో లేరని అంటున్నారు. కారణం ఏదైనా ఇప్పుడు కేసీఆర్కు కొత్త పార్లమెంట్ భవనంకు వెళ్లాలా వద్దా అన్నది అంతుబట్టడం లేదు. కాస్త తటపటాయించినా చివరి క్షణంలో పార్లమెంట్ అందరిదీ అని చెప్పి వెళ్తారని అంటున్నారు. అదే జరిగితే బీజేపీపై ఆయన పోరాటం తేలిపోతుందని బీఆర్ఎస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.