కోర్టులో ఉన్న స్థలాలకు పట్టాలిప్పిస్తానంటూ వేల మంది పోలీసుల బందోబస్తుతో అమరావతిలో బహిరంగసభ పెట్టి చంద్రబాబును నమ్మవద్దంటూ పదే పదే బతిమాలుకున్న సీఎం జగన్ రెడ్డి. అంతే కాదు అమరావతిలో ఇళ్ల స్థలాలు తన ఇంటి పక్కనే ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆ సెంటు స్థలం ఒక్కోటిపది లక్షలు వరకూ చేస్తుందని గప్పాలు కొట్టారు. మరి ఆ స్థలం ప్రభుత్వానికి ఎలా వచ్చిందన్నది మాత్రం చెప్పలేదు.
ఆ స్థలం పట్టాలు చెల్లుతాయని ఒక్క మాట చెప్పని జగన్
పేదల పేరుతో పొలిటికల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తూ.. వారికే లబ్ది చేకూరుస్తున్నట్లుగా షో చేసేందుకు జగన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. యాభై కోట్లకుపైగా ఖర్చు పెట్టి.. చిన్న చిన్న పనులు చేయించారు. రాళ్లు పాతించారు. తానే ఇందరికీ ఇళ్లు ఇస్తున్నానని.. నరకాసురుడినైనా నమ్మొచ్చు కాని, నారా చంద్రబాబునాయుణ్ని మాత్రం నమ్మకూడదని ప్రజలకు చెప్పుకొచ్చారు. జగన్ పంపిణీ చేసిన పట్టాలు చెల్లుతాయా..అందులో ఇళ్లు కట్టుకోవచ్చా అనేది మాత్రం జగన్ చెప్పలేదు. చంద్రబాబును నమ్మవద్దని తానే ఎక్కువ ఇళ్లు కట్టానని చెప్పుకునేందుకు తాపత్రయ పడ్డారు.
ఇక నుంచి అమరావతి అందరిదట !
అమరావతిపై అందరిదీ కాదంటూ చేసిన దుష్ప్రచారానికి జగన్ ఇవాళ తెరదించారని అనుకోవచ్చు. ఇక నుంచి అమరావతి అందరిదట. ఈ విషయాన్నే జగనే చెబుతున్నారు. రైతులు ఇచ్చిన భూముల్ని బయట వ్యక్తులకు పంచి పెట్టి… అది కూడా ఆ కేటాయింపులు చెల్లనివని తెలిసి .. ఇక ఆ రాజధాని అందరిదని చెబుతున్నారు. అయితే ఈ స్థలాలు వారికి దక్కుతాయని వారు కూడా అనుకోవడం లేదు. జగన్ ప్రసంగించినంత సేపు ఎవరూ చప్పట్లు కూడా కొట్టలేదు.
టిడ్కో ఇళ్లు జగనే కట్టారట !
అమరావతిలో భూమిలేని పేదల కోసం ఐదున్నర వేల టిడ్కో ఇళ్లు చంద్రబాబు ప్రభుత్వంకడితే నాలుగేళ్ల పాటు పంపిణీ చేయలేదు. ఇప్పుడు జగన్ రెడ్డి చంద్రబాబు ఇళ్లు కట్టించి ఉంటే నాలుగేళ్ల పాటు మీ బిడ్డ ఎందుకివ్వడని..తాను వచ్చాక కట్టి ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆయన మాటలు విని అందరూ ముక్కున వేలేసుకున్నారు. చెప్పేవాడికి వినేవాడు లోకవంటే ఇలాగే ఉంటుందా అనుకున్నారు. అమరావతి ప్రాంతం నుంచి ఒక్కర్ని కూడా సభకు రానివ్వలేదు. పూర్తిగా ఇతర ప్రాంతాల నుంచి బస్సుల్లో తీసుకు వచ్చి సభ నిర్వహించారు. స్వచ్చందంగా వచ్చిన వారు కూడా లేరు.