వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీఎం జగన్ పేరును తొలి సారి ప్రస్తావించింది సీబీఐ. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా అనుబంధ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్లో సీఎం జగన్ ప్రస్తావన తీసుకు వచ్చింది. హత్య విషయం జగన్ కు ఉదయం 6.15 కంటే ముందే తెలిసినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ స్పష్టం చేసింది. వివేకా హత్యకు గురయినట్లుగా మందుగా చూసినట్లుగా చెబుతున్న ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే హత్య విషయం జగన్ కు తెలుసన్నారు.
జగన్ కు అవినాష్ రెడ్డే చెప్పారా అనేది దర్యాప్తు చేయాల్సి ఉందిని సీబీఐ కౌంటర్ అఫిడవిట్లో తెలిపింది. శుక్రవారం సీబీఐ వాదనలు వినిపించలేదు. అవినాష్ రెడ్డి, సునీత తరపు లాయర్లు వాదనలు వినిపించడంతో సమయం గడిచిపోయింది. శనివారం ఉదయం సీబీఐ తరపు లాయర్లు వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా వివేకా కేసులో జగన్ అంశంపై కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీఎం జగన్ తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే వివేకానందరెడ్డి హత్య గురించి.. తనతో పాటు సమావేశంలో ఉన్న వారికి చెప్పారన్న ప్రచారం జరిగింది. ఆ నలుగురిలో ఒకరైన మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు కల్లాం అజేయరెడ్డి ఇటీవల మీడియా సమావేశం పెట్టారు.
తాను సీబీఐకి వాంగ్మూలం ఇచ్చానని చెప్పారు. జగనే తమకు వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారని..అయితే గుండెపోటా కాదా అన్నది మాత్రం చెప్పలేదన్నారు. మరో వైపు ఉదయమే వివేకా హత్య గురించి బయట ప్రపంచానికి తెలియక ముందే అవినాష్ రెడ్డి .. జగన్, భారతి పీఏలకు ఫోన్లు చేసి.. మాట్లాడాలని సీబీఐ గుర్తించి వారిని పిలిచి ప్రశ్నించింది. దీంతో ఈ వ్యవహారం కీలక మలుపులు తిరగబోతున్నట్లుగా చెబుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ వైపు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరో వైపు అవినాష్ రెడ్డి తన తల్లిని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి అక్కడే ఉంటున్నారు. ఇలాంటి సమయంలో సీబీఐ వేసిన అనుబంధ అఫిడవిట్ సంచలనం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.