జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజులు మంగళగిరి పార్టీ ఆఫీసులో ఉన్నారు. కొన్ని కీలక సమావేశాలు నిర్వహించారు జనసేన పార్టీ ఆఫీసులో నూతన భవనం ప్రారంభోత్సవం చేశారు. గురువారం నుంచి పార్టీ కార్యాలయంలోనే ఉన్న ఆయన పార్టీ కీలక నేతలతో పెద్దగా మాట్లాడటం లేదు. కానీ కొన్ని సర్వే సంస్థల ప్రతినిధులతో సమావేశం అయినట్లుగ జనసేన వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ముఖ్య నేతలతో కూడా కొన్ని సీక్రెట్ సమావేశాలు నిర్వహించారని అంటున్నారు. పోటీ చేసే స్థానాలపై ఓ క్లారిటీకి ముందుగానే వస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖాయమని పవన్ ఇప్పటికే ప్రకటించారు. బలం ఉన్న చోట్లనే పోటీ చేస్తామంటున్నారు. ఇప్పటికే ప్రకటించారు. జనసేనకు ఏ ఏ స్థానాల్లో బలం ఉందో తేల్చుకునేందుకు ఆయన కొన్ని సర్వే సంస్థలకు బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలిచేందుకు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జనసేనకు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు.. స్థానిక ఎన్నికల్లో వచ్చిన ఓట్లు.. తాజాగా సర్వేల్లో వస్తున్న ఫలితాలను బట్టి.. తెలుగుదేశం పార్టీ దగ్గర సీట్ల కోసం ప్రతిపాదనలు పెట్టనున్నట్లుగా చెబుతున్నారు.
పొత్తులు, పోటీ చేసే సీట్ల విషయంలో పార్టీ నేతలతో చర్చించేందుకు పవన్ కల్యాణ్ ఇష్టపడటం లేదని చెబుతున్నారు. ఆ విషయాలను తనకు వదిలేయాలని చెబుతున్నారు. తన నిర్ణయాన్ని శిరసావహించేవారే పార్టీ నేతలని.. వ్యతిరేకించేవారిని పట్టించుకోనని ఆయన చెబుతున్నారు. అవకాశవాద రాజకీయాలు.. పార్టీ నేతలపై స్పష్టత ఉన్న పవన్.. తన పని తాను చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నట్లుగా తెలు్సతోంది. శుక్రవారం సాయంత్రం ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.