2018 Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 3/5
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనాలు సృష్టించింది 2018. మే 5న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం కొద్దిరోజుల్లోనే వందకోట్ల మైలురాయి ని దాటేసింది. 2018 లో కేరళను ముంచెత్తిన భారీ వరదల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇప్పుడు నిర్మాత బన్నీ వాసు తెలుగులో విడుదల చేశారు. అంతగా సంచలన విజయం సాధించదగ్గ అంశాలు ఇందులో ఏమున్నాయి ? కేరళ జల విలయం ప్రేక్షకులకు ఎలాంటి అనుభవాన్ని పంచింది?
అనూప్(టోవినో థామస్) విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తుంటాడు. గతంలో అతను ఆర్మీలో ఉంటాడు. అయితే ఆర్మీ నుంచి పారిపోయి వచ్చాడని ఊరిలో వాళ్ళు అతన్ని హేళన చేస్తుంటారు. అదే ఊరికి టీచర్ గా వచ్చిన మంజు(తన్వి రామ్)ని ప్రేమిస్తాడు అనూప్. దుబాయ్ లో ఐటీ జాబ్ చేస్తున్న రమేశన్(వినీత్ శ్రీనివాసన్)కి తన భార్యతో ఏవో మనస్పర్థలు వుంటాయి. తల్లికి ప్రమాదం జరగడంతో స్వదేశానికి బయల్దేరుతాడు. రిపోర్టర్ గా పని చేస్తుంటుంది నూరా(అపర్ణ బాలమురళి) తమిళనాడుకి చెందిన లారీ డ్రైవర్ సేతు(కలైయరసన్). టాక్సీ డ్రైవర్ గా పనిచేసే కోషి(అజు వర్గీస్) ఓ విదేశీ జంటకు కేరళలో పర్యాటక ప్రదేశాలు చూపించాలని పయనమౌతాడు. ఓ పెద్ద మోడల్ కావాలని కలలు గనే మత్య్సకార కుటుంబానికి చెందిన యువకుడు నిక్సన్ (అసిఫ్ అలీ). ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి (కుంచకో బొబన్).. ఇలా ఒకొక్కరిది ఒక్కొ నేపధ్యం. వీరందరి జీవితాలు కేరళ వరదల్లో ఎలా మారాయి? ఎలాంటి సంఘనలు చోటు చేసుకున్నాయి? ఎలాంటి మలపులు తిరిగాయి ? అనేది ఈ మిగతా కథ.
2018 కేరళ భారీ వరదలు నేపధ్యంలో సాగే కథ ఇది. ఆ ప్రకృతి భీవత్సవాన్నిచూపించడానికి కథలో చెప్పిన పాత్రలని ఒకొక్క ఉపకథగా పేర్చుకుంటూ అక్కడ జీవితాల్ని మెల్లగా పరిచయం చేసుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. నిజానికి మొదట్లో ఈ కథ ఎటువెళుతుంది ? తెరపైకి ఇన్ని పాత్రలని ఎందుకు తీసుకొస్తున్నారు ? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. అనూప్, మంజు పాత్రలతో ఓ ప్రేమ కథ వుందని అనుకునే సమయంలో మరో వైపు సేతు కథ నడుస్తుంది. అదే కథతో పాటు నిక్సన్, కోషి , నూరా.. ఇలా ఎవరి పాత్రలు చుట్టూ వారి నేపధ్యాలు, కథలు వుంటాయి. కాసేపు గజిబిజిగా అనిపిస్తుంది. పైగా మలయాళ సినిమాలకు వుండే డిటెయిలింగ్ కాసేపు సహనానికి పరీక్ష పెడుతుంది. అయితే విరామం ముందు ఘట్టాలు చూసిన నప్పుడు ఈ పాత్ర లన్నీ ఒక ప్రళయం అంచులో ఉన్నాయనే ఆందోళన ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఎప్పుడైతే విరామం పడుతుందో .. తర్వాత ఏం జరుగుతుంది ? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో పెరిగిపోతుంది.
ద్వితీయార్ధం నుంచి అసలు కథ, విలయం మొదలౌతుంది. ఇక్కడి నుంచి ప్రతి సన్నివేశం చూపుతిప్పనివ్వకుండా చేస్తోంది. మొదటి సగాన్ని పునాదిలా వాడుకున్న దర్శకుడు రెండో సగంలో అ పునాదిని భావోద్వేగాలు పండించడానికి వాడుకున్న తీరు మెప్పిస్తుంది. అప్పటివరకూ ఎదో నడుస్తున్నాయనే పాత్రలపై ఒక్కసారిగా ప్రేక్షకులకు ప్రేమ, ఆపేక్ష కలుగుతాయి. అందులో ఒక్కపాత్రకి కూడా నష్టం జరగకూడదని కోరుకుంటూ ఉత్కంఠతో చూస్తాడు. ద్వితీయార్ధంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడటానికి మత్స్యకారులు చేసే సాహసం, అనూప్ గర్భిణీ స్త్రీని హెలికాఫ్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించే సన్నివేశం.. అంత వరదలో సర్టిఫికేట్ల కోసం చేసే ప్రయాణం.. ఇలా చాలా సన్నివేశాలు భావోద్వేగాలతో నిండిపోతాయి.
తెరపై కనిపించే చాలా మంది నటీనటులు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియని ముఖాలే. కానీ వారంతా సినిమా ముగిసేసరికి ప్రేక్షకుడికి గుర్తుండిపోతారు ఇందులో ప్రత్యేకంగా హీరోలు, హీరోయిన్లు అంటూ ఎవరూ లేరు. అన్ని పాత్రలకు హీరో అయ్యే ఛాన్స్ ఇచ్చేలా కథనంను రాసుకున్నాడు దర్శకుడు. దర్శకుడు ఎంచుకున్న నటీనటులంతా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. టోవినో థామస్ ఎంతో సహజంగా కనిపించాడు. ఒకవైపు వరదలు ముంచెత్తుతున్న అతడిలో ఎలాంటి భయాందోళనలు వుండవు. ఆర్మీ నేపధ్యంతో ఆ పాత్రని దర్శకుడు బ్యాలెన్స్ చేసిన విధానం మెప్పిస్తుంది. తను ఎక్కడా నటిస్తున్నట్లు అనిపించదు. రమేశన్ పాత్రలో వినీత్ శ్రీనివాసన్ కు ఫుల్ మార్కులు పడిపోతాయి. అనూప్ ప్రేయసి మంజుగా తన్వి రామ్, ప్రభుత్వ అధికారి షాజీ పున్నూస్ గా కుంచాకో బోబన్, లారీ డ్రైవర్ సేతుపతిగా కలైయరసన్, టాక్సీ డ్రైవర్ కోశిగా అజు వర్గీస్, టీవీ రిపోర్టర్ నూరా పాత్రలో అపర్ణ బాలమురళి ఇలా అందరూ వారివారి పాత్రల్లో ఒదిగిపోయారు. తెలుగువారికి పరిచయమైన వారిలో లాల్ కనిపిస్తారు. ఆయనది చాలా కీలకమైన పాత్ర. లాల్ పెద్ద కొడుకుగా నరైన్, చిన్నకొడుకుగా ఆసిఫ్ అలీ నటన మెప్పిస్తుంది. మిగతా అందరూ వారి పాత్రల మేరకు కనిపించారు.
టెక్నికల్ గా సినిమా ఉన్నతంగా వుంది. అఖిల్ జార్జ్ తన కెమెరా పనితనం బ్రిలియంట్. ఎంతో సహజంగా వరదలని, అక్కడి వాతావరణంను రిక్రియేట్ చేశారు. నోబిన్ పాల్ నేపథ్య అసాధారణంగా వుంది. మిగతా టెక్నికల్ టీం అంతా దర్శకుడి విజన్ కి గొప్పగా సహకరించారని సినిమా చూస్తే అర్ధమౌతుంది. దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సర్వైవల్ థ్రిల్లర్ జోనర్ లోకి వచ్చే సినిమా ఇది. అయితే కల్పితం కాదు. 2018 వరదలు కేరళకు అపార నష్టం కలిగించాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకేతో మంది నిరాశ్రయులయ్యారు. అలాంటి మహా విషాదాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. కానీ జూడ్ ఆంథనీ జోసెఫ్ ఆ జల ప్రళయాన్ని వెండితెరపై ఎంతో నేర్పుతో చూపించారు. వరదల్లో ప్రేక్షకుడు చిక్కిపోయాడా ? అనేంత సహజంగా సినిమాని తీర్చిదిద్దాడు. ప్రకృతి విపత్తుల, విషాదాల నేపధ్యంలో ఇది వరకూ కొన్ని సినిమాలు వచ్చాయి. వాటిలో చాలా ప్రత్యేకంగా ప్రేక్షకుడికి గుర్తుండిపోయే సినిమా ఇది.
తెలుగు360 రేటింగ్: 3/5