ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల స్కాం విషయంలో రేవంత్ రెడ్డి ఎక్స్ ట్రీమ్ ఆరోపణలు చేసి.. చివరికి తాను అనుకున్న ఎఫెక్ట్ సాధించారు. ఈ ఇష్యూలోకి హెచ్ ఎండీ ఏ అధికారులను లాగేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ శుక్రవారం లీగల్ నోటీసులు జారీ చేసింది. ఆయన ఓఆర్ఆర్ టెండర్లపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ప్రజల్లో హెచ్ఎండీఏ పరువు తీస్తున్నారని, సంస్థ అధికారుల స్థైర్యం దెబ్బతీస్తున్నారని.. 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్చేసింది. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇదే ఎఫెక్ట్ కోసం చూస్తున్న రేవంత్ రెడ్డి ఇక తగ్గలేదు. తేల్చుకుందామంటున్నారు. ఓఆర్ఆర్ టెండర్ల స్కామ్.. లిక్కర్ స్కామ్ కంటే వెయ్యి రెట్లు పెద్దదని మొత్తం బయటకు రావాల్సిందేనని అంటున్నారు. దీనిపై కోర్టుకు వెళ్తానని చెప్పారు. క్రిమినల్ ప్రొసీజర్ ద్వారా కోర్టులో తేల్చుకుంటానని తెలిపారు. ఇది తనకే మంచి అవకాశమని, టెండర్‌ను రద్దు చేసేందుకు ఇదొక చాన్స్ అని పేర్కొన్నారు.
నిజానికి టెండర్ డాక్యుమెంట్ పూర్తిగా బయట పెట్టలేదు.ఇది రేవంత్ రెడ్డికి మరో అస్త్రంగా మారింది. ఈ వ్యవహారంలో టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థపై అనేక ఆరోపణలు , కేసులు ఉన్నాయి. ఇదంతా కేటీఆర్, కవితల బినామీలుగా నడిపిస్తున్న నాటకం అని.. రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ కూడా దూకుడుగానే ఉంది. టెండర్లపై సీబీఐకి ఫిర్యాదు చేశామని రఘునందన్ రావు చెబుతున్నారు.
హెచ్ఎండీఏ .. ఔటర్ టెండర్ల అవినీతి విషయంలో ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా చేయడానికి .. లీగల్ నోటీసులు కీలకం కానున్నాయి. దీంతో ఇప్పుడు ఈ అంశాన్ని ఎలా సైలెంట్ చేయాలా అన్నది బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారింది.