ఢిల్లీ ప్రజా ప్రభుత్వ అధికారాలను పరిమితం చేస్తూ కేంద్రంతీసుకు వచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని దేశవ్యాప్తంగా పార్టీలను కేజ్రీవాల్ కోరుతున్నారు. ఆయన నేరుగా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో సమావేశం అయ్యారు. ఇద్దరూ కలిసి సంయుక్త ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ కేంద్రం ఎమర్జెన్సీ దిశగా వెళ్తోందని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను రాజకీయంగా వాడుకుంటోందని అన్నారు. అంతా బాగుంది కానీ.. కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ కు పార్లమెంట్ లో వ్యతిరేకంగా ఓటేస్తామని మాత్రం చెప్పలేదు. కేంద్రం ఉపసంహరించుకునేవవరకూ పోరాడుతామని అంటున్నారు.
కేంద్రం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ బిల్లుగామారాలంటే రాజ్యసభలోనూ ఖచ్చితంగా పాస్ కావాలి. బీజేపీకి రాజ్యసభలో మెజార్టీ లేదు. వైసీపీలాంటి పార్టీల సాయంతో గట్టెక్కాలి. అదే సమయంలో బీఆర్ఎస్ లాంటి పార్టీలు మద్దతివ్వకపోయినా కనీసం బాయ్ కాట్ అయినా చేయాలి. వ్యతిరేకంగా ఓటేస్తే మాత్రం బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. గత తొమ్మిదేళ్ల కాలంలో బీజేపీకి బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేసిన సందర్భమే లేదు.అత్యంత వివాదాస్పద బిల్లులు అయిన వ్యవసాయ చట్టాలకు కూడా బీఆర్ఎస్ ఎంపీలు మద్దతిచ్చారు. తర్వాత కొన్ని సందర్భాల్లో బాయ్ కాట్ చేశారు కానీ.. వ్యతిరేకించలేదు.
ఇటీవల కేసీఆర్ మారిన రాజకీయ వ్యూహం కారణంగా..బీజేపీ విషయంలోగతంలో ఉన్నంత దూకుడు చూపించడం లేదు. కేజ్రీవాల్ తో ఉన్న రాజకీయ సంబంధాల వల్ల ఆయనను ప్రగతి భవన్కు ఆహ్వానించి ఉంటారు కానీ..బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసేంత పరిస్థితి ఉందని ఆయన కూడా అనుకుంటారని .. కేజ్రీవాల్ భావిస్తున్నారని అనుకోవడం లేదు. తనకు అవసరమైనప్పుడు అందరి మద్దతు కోరుతున్న కేజ్రీవాల్.. బీజేపీ విషయంలో ఇతర పార్టీలకు ఇబ్బంది ఎదురయినప్పుడు అసలు పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు ఆయనకు ఇతర పార్టీల నుంచి.. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి కూడా సానుకూల స్పందన రావడం లేదు.