ఓ పార్టీకి గడ్డు పరిస్థితి ఉందని అనిపిస్తే.. సహజంగానే క్యాడర్ లో నిరాశ ఉంటుంది. కానీ అత్యున్నత విజయాన్ని అందుకోబోతున్నామని అనిపిస్తే.. క్యాడర్ లో .. ప్రతినిధుల్లో.. నేతల్లో ఉండే ఉత్సాహాన్ని పట్టడం కష్టం. అలాంటి ఉత్సాహం టీడీపీ మహానాడులో కనిపిస్తోంది. రాజమండ్రిలో తొలి రోజు నిర్వహించిన ప్రతినిధుల సభ కిక్కిరిసిపోయింది. బహిరంగసభకు వచ్చినంత మంది ప్రతినిధులు వచ్చారు. పదిహేను వేల మంది ప్రతినిధులు వస్తారని అంచనా వేసుకున్నారు.కానీ లక్ష మందికిపైగా వచ్చారు. రాజమండ్రి రోడ్ లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
ప్రతినిధుల సభలో చంద్రబాబు ప్రసంగం క్యాడర్ ను ఉత్తేజపరిచింది. పార్టీలో మార్పు కోసం ఆయన చెప్పిన మాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి. సైకిల్ ..ఎలక్ట్రిక్ సైకిల్ గా మారాల్సి ఉందన్నారు. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్ శకం ప్రారంభమవుతుందని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉందని, రాజమండ్రిని పుష్కర వేళ రాజమహేంద్రవరంగా పేరు మార్చామని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ జయంతి రోజున పార్టీ మెనిఫెస్టోలో ఓ భాగాన్ని ప్రకటిస్తామన్నారు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పీచ్ ..క్యాడర్ లో జోష్ నింపింది. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలను టీడీపీ గెలుచుకోవడం ఖాయమని 2019లో ఓ దోపిడీ దొంగకు ప్రజలు ఓట్లేసి తప్పు చేశారన్నారు తెలుగుదేశాన్ని ఎదుర్కోలేకే.. జగన్ కోడి కత్తి డ్రామా.. సొంత బాబాయ్‌ని చంపి ప్రజల సానుభూతితో ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. జగన్‌ను వేటాడి.. వెంటాడి తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలోనే కాదు.. పులివెందులలో కూడా కర్రు కాల్చి వాత పెట్టారు. చంద్రబాబు కట్టిన టిడ్కో ఇళ్లను పక్కన పెట్టేసి సెంటు పట్టా ఇచ్చారు. వివేకా హత్య విషయంలో మేం చెప్పిందే సీబీఐ చెప్పింది. వివేకా చనిపోయిన విషయం జగన్‌కే ముందు తెలిసింది. బాబాయ్ హత్య కేసు తమ మీదకు వస్తుందని జగన్ భయపడుతున్నారు. రూ. 2 వేల నోటు రద్దుతో తన దగ్గరున్న నోట్లను ఏం చేయాలో తెలియక జగన్ తల పట్టుకున్నారని విమర్శించారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారందరూ సహా.. ప్రతి ఒక్కరూ టీడీపీ పండుగలో పాల్గొనేందుకు తరలి రావడంతో రాజమండ్రి మొత్తం పసుపు మయం అయింది. అది వారం భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. పదిహేను లక్షల మంది వస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.