వైఎస్ వివేకా హత్య కేసులో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవినాష్ రెడ్డి అరెస్టును తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు.. ధ్రిల్లర్ ను తలపిస్తూండగా.. వీలైనంత వరకూ ఆయన సక్సెస్ అవుతున్నారు. ఈ క్రమంలో సీబీఐ బయట పెడుతున్న విషయాలు మాత్రం సంచలనంగా మారుతున్నాయి. ఒక రోజు ముందుగా కౌంటర్ అఫిడవిట్ లో జగన్ పేరు చెప్పిన సీబీఐ .. తర్వాత వాదనల్లో రహస్య సాక్షి గురించి చెప్పారు. దీంతో అవినాష్ క్యాంప్ గుండెల్లో రాయి పడినట్లయింది.
ఆ రహస్య సాక్షి ఎవరన్నదానిపై ఇప్పటికే వైఎస్ కుటుంబంలోనే ఓ అంచనా ఉందని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పక్కా సాక్ష్యాలతో ఆ రహస్యసాక్షి సీబీఐకి సహకరిస్తున్నారని అంటున్నారు. అసలు కుటుంబంలోని వారే చెప్పాల్సినదంతా చెప్పాలనుకుంటే ఇక చేయాల్సిందేమీ ఉండదు. ఇప్పుడు అవినాష్ రెడ్డి అండ్ గ్యాంగ్ కు అదే పరిస్థితి వచ్చింది. తాత్కలికంగా అరెస్ట్ నుంచి తప్పించుకుంటున్నాం కానీ నిండుగా మునిగిపోతున్నామన్న అభిప్రాయానికి వారు రావాల్సి వస్తోంది.
సీబీఐ ఈ కేసును వ్యూహాత్మకంగానే ముందుకు నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అవినాష్ రెడ్డికి లభించే ఊరటలు.. దాని కోసం జరుగుతున్న పరిమామాలపైనా సీబీఐ ఓ కన్నేసి ఉంచిందని చెబుతున్నారు. ఈ కేసు విషయంలో సీబీఐ చాలా ఒత్తిళ్లు ఎదుర్కొంటోంది. కానీ తగ్గడం లేదు. మరింత పట్టుదలను పెంచుతోంది. రహస్య సాక్షి విషయాన్ని ఇంత కాలం గుప్తంగా ఉంచడమే దీనికి సాక్ష్యం. సరైన సమయంలో బయట పెట్టారు. ఇప్పుడు సీబీఐ ఫైనల్ గేమ్ ప్రారంభించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.