వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. కలుస్తారు కూడా. కానీ ఆయన ఎప్పుడు కలిసినా రాత్రి పదిగంటల తర్వాతే ఒక్కో సారి పదకొండు గంటలు అవుతుంది. అలా రాత్రిళ్లు కలిసిన తర్వాత ఆయన తరపున ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేస్తుంది. పోలవరం నిధులు సహా అన్ని అంశాలు అడిగామని. విచిత్రం ఏమిటంటే.. ఈ స్టేట్మెంట్లో ఉండే విషయాలను..కేంద్ర హోంమంత్రికి సంబంధం ఉండదు.
మరి నిజంగా రాష్ట్ర అంశాలపైనే మాట్లాడాలని అనుకుంటే.. ఉదయం పూటే కలవొచ్చు కదా అనేది ఎక్కువ మందికి వచ్చే సందేహం. సాధారణంగా అమిత్ షా ఉదయం మొత్తం అధికారిక కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు. పార్టీ పరమైన కార్యక్రమాలకే … సాయంత్రం తర్వాతా సమయం కేటాయిస్తారు. అత్యవసరమైన పరిపాలనా విషయాలను ఆ తర్వాత అవసరం అయితే అధికారులతో సంప్రదిస్తారు కానీ రాజకీయ నేతలతో మాట్లాడరని చెబుతారు. మరి జగన్మోహన్ రెడ్డి రాత్రి సమయంలో వెళ్లి మాట్లాడేది రాజకీయాలా… పరిపాలనా సంబంధమైన విషయాలా ?
కారణం ఏదైనప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి .. ఇలా అమిత్ షా కోసం పడిగాపులు పడి మరీ… ఇంటికి వెళ్లి పావుగంట.. అరగంట భేటీ అయి ఏం విజ్ఞాపనలు చేస్తారో కానీ.. ఆయన తీరుపై ప్రజల్లో మాత్రం ఓ రకమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, ఎంపీలను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలు, కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి.
ఇలాంటి భేటీల తర్వాత తానేదో రాష్ట్రం కోసం యుద్ధం చేసి వస్తున్నానన్నట్లుగా ప్రకటనలు చేయడం.. ఇలాంటి విమర్శలు మరింత ఎక్కువగా రావడానికి .. జగన్ ను ట్రోల్ చేయడానికి కారణం అవుతున్నాయి.