పేదల కోసం జగన్ పెత్తందారులపై పోరాటం చేస్తున్నారని.. క్లాస్ వార్ అంటూ వైసీపీ ఏపీ వ్యాప్తంగా ఫ్లెక్సీలు పెడుతోంది. ఈ పోస్టర్లను చాలా మంది ఇతర పార్టీల వాళ్లు ఎక్కడిక్కడ చించేస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు పవన్ కల్యాణ్ ను అవమానించేలా పోస్టర్ లో చిత్రీకరించారని పోలీసు కేసులు పెడుతున్నారు. అయితే రాజకీయాలు ఎలా ఉన్నా.. ఈ పోస్టర్ పై మాత్రం విస్తృతంగా చర్చ జరుగుతోంది. పేదల్ని దోచుకున్న జగన్ ఇప్పుడు పేదల కోసం పోరాడుతున్నట్లుగా పోస్టర్లు వేసుకోవడం చర్చనీయాంశమవుతోంది.
మద్యం దోపిడీ అంతా నిరుపేదల రక్తమే !
మద్యం రేట్లు పెంచి ..షాక్ కొట్టేలా చేసి మద్యం మాన్పిస్తానని చెప్పిన జగన్.. చెప్పినట్లుగా రేట్లు పెంచారు. ఎవరూ మద్యం మానేయలేదు. కానీ ప్రభుత్వానికి ఏటా రూ. 30 వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఇదంతా ఎవరి సొమ్ము. నిరుపేదల సొమ్ము. ప్రభుత్వం అమ్మే బ్రాండ్లు కాస్త ధనికులు ఎవరూ కొనరు. పొరుగురాష్ట్రాలకో.. స్మగ్లింగ్ చేసిన మద్యమో కొంటారు. కానీ నిరుపేదలు మాత్రం ఈ బ్రాండ్లు కొనాల్సిందే. నిరుపేదల రోజువారీ ఆదాయంలో సగం ఈ మద్యం పేరుతోనే ప్రభుత్వం పీల్చేస్తోంది.
ఓటీఎస్ పేరుతో నిరుపేదలకు వంచన
ఎప్పుడో ఎన్టీఆర్ కాలంలో ఇచ్చిన ఇళ్ల దగ్గర్నుంచి అన్ని ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. ఒక్కో నిరుపేద ఇంటిపైకి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు..ఇలా పది మందిని పంపారు. ఖచ్చితంగా కట్టాలన్న ఒత్తిడి తెచ్చారు. వారందరి దగ్గర డబ్బులుకట్టించుకున్నారు. కడితే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని.. బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవచ్చని ప్రచారం చేశారు. కానీ డబ్బులు వసూలు చేశారు కానీ ఎవరికి రిజిస్ట్రేషన్లు చేశారో ఎవరికీ తెలియదు. ఎవరికీ లోన్లు కూడా ఇవ్వలేదు. ఇలా దోపిడీ చేసింది నిరుపేదల్ని కాదా ?
పేదల పేరుతో వేల కోట్ల దోపిడీ
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో పనికిరాని పొలాలను లక్షల ప్రజాధనం పెట్టి కొనుగోలు చేశారు. కనీసం రూ. పదిహేను వేల కోట్ల స్కాం జరిగిదని చెబుతున్నారు. కానీ పేదలకు మాత్రం ఇళ్లు రాలేదు. కనీసం పునాదుల దశ దాటలేదు. ఎన్ని ఇళ్లు కడతారో కూడా స్పష్టత లేదు. కానీ ఈ పేరుతో పేదలు మాత్రం అప్పుల పాలవుతున్నారు.
ఇలా ఒకటి కాదు.. ఏపీలో జరిగిన ప్రతీ స్కామ్‌లోనూ పేదల్ని దోచుకునే స్కీమ్ ఉంది. ఇవన్నీ వారికి తెలియనివి కాదు. మరి వారిని దోచుకునేవారికే మేలు చేస్తున్నానని పోస్టర్లు వేసుకుంటే… వారి మారిపోతారా ? తమను దోచుకున్న వారికి బుద్ది చెప్పకుండా ఉంటారా ?