విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ఇంచార్జ్ గా ఉన్నప్పుడు ఆయన ఓ సమావేశం పెడితే.. పెద్ద ఫంక్షన్ హాల్ నిండిపోయేది. ఫలానా చోట సోషల్ మీడియా కార్యకర్తల సమావేశం పెడుతున్నాం అని వారికి సమాచారం ఇస్తే చాలు వారంతా వచ్చి పడేవారు. ఇప్పుడు.. ఆ సోషల్ మీడియా సజ్జల భార్గవ్ రెడ్డి చేతికి వెళ్లింది. ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో పని చేసే వారి కోసం ఆయన ఊళ్లు పట్టుకు తిరుగుతున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్నందున సోషల్ మీడియాలో పనిచేయాలంటూ.. బెంగళూరు, చెన్నై , హైదరాబాద్ సహా చాలా నగరాల్లో సమావేశాలు పెడుతున్నారు. పెద్ద పెద్దలగ్జరీ కన్వెన్షన్లు, హోటళ్లలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు పట్టుమని రెండు వందల మంది కూడా రావడం లేదు. అయినా సరే వచ్చే ఎన్నికల కోసం కొత్త రిక్రూట్ మెంట్ కోసం సజ్జల భార్గవ ప్రయత్నిస్తున్నారు. టెక్నాలజీపై పట్టు ఉన్న ఐటీ ఉద్యోగుల్లో తమ పార్టీకి మద్దతిచ్చే వర్గం అంతా .. పోస్టులు పెట్టేలా చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. కానీ చాలా మంది సైలెంట్ గా ఉంటున్నారు.
వైసీపీ సోషల్ మీడియా వాడుకుని వదిలేస్తుందని.. కేసులు పెట్టినా పట్టించుకోరన్న అభిప్రాయం ఉంది.అంతే కాదు అసలు అనుచిత పద్దతుల్లో .. సోషల్ మీడియా ప్రచారానికి పురికొల్పి.. పార్టీని నమ్ముకున్న వారిని కేసుల్లో ముంచి.. వారి భవిష్యత్ ను .. తమ రాజకీయ అవసరాల కోసం బలి చేయడానికి వెనుకాడరని ఇప్పటికే అనేక సార్లు రుజువు అయిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వైసీపీ సోషల్ మీడియా కంటెంట్ ను ప్రచారం చేస్తే.. ఎదుర్కోవాల్సిన పరిణామాలు.. న్యాయపరంగానే కాకుండా.. తాము ఉద్యోగం చేసే సంస్థల్లో తమపై వ్యతిరేక భావం పెంచుతాయనే ఆందోళనలో ఎక్కువ మంది ఉన్నారు. అందుకే వారు పెద్దగా పని చేయడం లేదు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్షల మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రచారం చేసేవారు. ప్రభుత్వంపై కులం ముద్ర వేయడంలో వీరు కీలకం. అధికారంలోకి వచ్చాక వీరిని ఎవర్నీ పట్టించుకోకపోవడంతో అందరూ చెల్లాచెదురయ్యారు.ఇప్పుడు ఎన్నికలకు ముందు అలాంటి వారి కోసం సజ్జల భార్గవ వెదుక్కుంటున్నారు.