వైసీపీలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. పాలన ప్రారంభమై నాలుగేళ్లయిన సందర్భంగా సీఎం జగన్ విజయవాడలోని మదర్ ధెరీసా ఆశ్రమానికి సతీసమేతంగా వెళ్లారు. ఆ హై క్వాలిటీ దృశ్యాలు మీడియాకు ఇచ్చారు .కానీ అసలు రాజకీయ సందడి అంతా సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడితే. జగన్ ది ఏముంది పైన కూర్చుంటాడు.. కింద అంతా మాదే అన్నట్లుగా వీరి వ్యవహారశైలి నడిచిపోయింది.
నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా క్యాడర్ ఎక్కడా సంబరాలు చేయలేదు. వారి దగ్గర ఉన్న పులుసునంతా పార్టీ హైకమండ్ లాగేసింది. పదవుల్లో ఉన్న కొంత మంది ప్రెస్ మీట్లు పెట్టి నాలుగేళ్ల పాలనా విజయాలంటూ చంద్రబాబును తిట్టారు. అదే పని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చేశారు. పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేసి విపక్షాలను తిట్టారు. గుంటనక్కలన్నారు.. పొత్తులతో వస్తున్నారన్నారు. అదే సమయంలో హామీలన్నీ తామే అమలు చేస్తున్నట్లుగా మాట్లాడారు. ఇంకా మూడు, నాలుగు సంవత్సరాల సమయం అవసరమని చెప్పుకొచ్చారు.
విచిత్రం ఏమిటంటే అసలు తానే పరిపాలిస్తున్నట్లుగా.. ప్రభుత్వం గురించి.. ప్రభుత్వ పథకాల గురించి.. పరిపాలనా తీరు గురించి సజ్జల విచ్చలవిడిగా ఇంటర్యూలు ఇచ్చేశారు. ఇతర చానళ్లకు..మీడియాకు ఇవ్వలేదు. తమకు అనుబంధ మీడియాకే ఇచ్చారు. వాటిని ప్రైమ్ టైమ్ లో ప్రసారం చేసుకుంటారు. అయితే ఇవి చూసిన వారికి అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు అనే సందేహం రాక మానదు. ఆయన కేవలం ఓ సలహాదారు మాత్రమే. కానీ ఇలా సీఎం చేయాల్సిన పనుల్ని తానే తీసుకుని పెద్ద మనిషిగా ప్రవర్తించడమే పార్టీ క్యాడర్ కూడా ఆర్థం కావడం లేదు.
ఆఫ్ లైన్లో ఆయన ఓవరాక్షన్ అలా ఉంటే.. ఆన్ లైన్ ఆయన కుమారుడి హంగామా పరిధి దాటిపోతోంది. వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ గా ఉన్న ఆయన జగన్ పాలనా విజయాల ప్రచారం కన్నా. తన తండ్రి అన్న మాటలు.. తన ఫోటోలను హైప్ చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఆన్ లైన్ లో కొడుకు.. ఆఫ్ లైన్ లో తండ్రి .. వైసీపీని దున్నేస్తున్నారని.. పాపం జగన్ అని అనుకుంటున్నారు.. ఆ పార్టీ క్యాడర్ తో పాటు ఇతర నేతలు కూడా.