జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసినా సంక్షేమ క్యాలెండర్ ను మాత్రం వదిలి పెట్టకుండా అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ అది కూడా దారి తప్పుతోంది. చెప్పిన సమయానికి కాకుండా..నెలల తరబడి ఆలస్యం అవుతోంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ సహా అన్నీ ఆలస్యంగానే ఇస్తున్నారు. తాజాగా రైతు భరోసా కూడా మిస్ అయింది. అధికారంలోకి వ్రతి ఏడాది మేలో పన్నెండున్నరవేలు ఒకే సారి ఇస్తానని హామీ ఇచ్చారు. చివరికి మాట మార్చారు. ఇప్పుడు ఆర్థిక సమస్యలతో అది మేలో కూడా ఇవ్వడం లేదు.
ముఫ్పైవ తేదీన బటన్ నొక్కడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదోనిలో సభా ఏర్పాట్లుకూడా చేశారు.కానీ ఖజానాలో నిధుల్లేకపోవడంతో రెండు రోజులకు వాయిదా వేశారు.దీంతో జూన్ నెలకు వెళ్లిపోయింది. అంటే జూన్ లో బటన్ నొక్కుతారు. నిజానికి జూన్ లో అమ్మఒడికి బటన్ నొక్కాల్సి ఉంది.దానికి ఆరున్నర వేల కోట్ల వరకూ కావాలి. నిజానికి పది రోజుల కిందటే కేంద్రం రూ. పది వేల కోట్ల నిధులు ఇచ్చింది. అవన్నీ ఏమయ్యాయో.. రాష్ట్ర ప్రభుత్వానికే తెలియాలి. ప్రతీ వారం రెండు వేల కోట్లు తీసుకు వస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి అనుమతి ఇచ్చిన అప్పులో సగం ఇప్పటికే తీసేసుకున్నారు. కానీ రెండు నెలలు కూడా కాలేదు.
ప్రభుత్వం ఇంకా అనేక పథకాలకే కాదు.. చాలా బిల్లులు చెల్లించాల్సి ఉంది. వాటికి వేల కోట్ల నిధులు కావాలి. కేంద్రం ఇచ్చిన రూ. పది వేల కోట్లు ఎవరికి సర్దుబాటు చేశారో తేలాల్సి ఉంది. వచ్చే నెల కూడా సమయానికి జీతాలివ్వకపోతే ఉద్యోగులు తిరగబడే ప్రమాదం ఉంది. ప్రతీ వారం అప్పులు తెచ్చుకుంటూ.. కేంద్రం వేల కోట్ల ఇస్తున్నా.. జీతాలివ్వకపోతే ముందు ముందు పరిస్థితి దారుణంగా ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.