దక్షిణాదికి దేశంలో ప్రాధాన్యం తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లోక్ సభ సీట్లను తగ్గించబోతున్నారని చాలా కాలంగా పార్టీలు ఆరోపిస్తున్నాయి. 2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన లోక్‌సభ స్థానాల డిలిమిటేషన్ జరగనుంది. దీని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్న అంచనాలు ఇప్పటికే నిపుణులు వేస్తున్నారు. యూపీ, బీహార్‌లలో ఎన్ని సీట్లు ఉంటాయో.. మొత్తం దక్షిణాదిలో అన్ని సీట్లు మాత్రమే ఉంటాయని చెబుతున్నారు.
ఇలా రూపొందిన ఓ మ్యాప్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో పంచుకుని దక్షిణాది రాష్ట్రాలకు జరుగబోతున్న అన్యాయంపై ప్రశ్నించారు. అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను, విధానాలను నమ్మి ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉందన్నారు.
ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలు ఈ నూతన డిలిమిటేషన్ వల్ల తక్కువ లోక్‌సభ స్థానాలు పొందడం అన్యాయం, బాధాకరమని ట్విట్టర్ వేదికగా తెలిపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్ల పెంపులో లబ్ధిపొందుతున్నాయని.. ఇది దురదృష్టకరమన్నారు.
జనాభాను నియంత్రించిన కేరళ, తమిళనాడు , ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
నిజానికి ఇలాంటివి జరిగితే దేశంలో దక్షిణాది సెంటిమెంట్ పెరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. అందుకే అన్యాయం చేయబోమని కేంద్ర పెద్దలు అనధికారికంగా చెబుతున్నారు. కానీ ఏం చేస్తారన్నది డి లిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైతేనే తెలుస్తుంది.