ఓ సర్వర్ సమస్య వస్తే ఎంత సేపు ఉంటుంది. ఎంత చిన్న వెబ్ సైట్ వాడైనా రెండు, మూడు గంటల్లో సరి చేసుకుంటాడు. కానీ ఏపీలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు మాత్రం రోజుల తరబడి సర్వర్ల సమస్య వస్తోంది. ఇక కావడం లేదని.. పదేళ్ల కిందట ఎలా మాన్యువల్ గా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారో అలా చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ నిర్ణయం చూసిన తర్వాత ఏదో పెద్ద గూడుపుఠాణి జరుగుతోందని ఎవరికైనా అనుమానం వస్తే అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే సింపుల్ పరిష్కారం కావాల్సి సర్వర్ సమస్యను రోజుల తరబడి నాన్చడమే కాకుండా..పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు చేయాలనుకోవడం.. ఏమిటి ?
మాన్యువల్ పద్దతిలో రిజిస్ట్రేషన్లలో భారీ అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తునభూములు పేర్లు మార్చుకోవడం.. ప్రభుత్వ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వంటివి చేసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మామూలుగా ప్రభుత్వం జీవోలే ఆన్ లైన్ లో పెట్టదు. ఇక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల గురించి బయటకు తెలిసే చాన్స్ లేదు. ఎవరి భూమి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందో..ఎవరో చేశారో చెప్పడం కష్టం. ఫేక్ పత్రాలతో ఇప్పటికే ఏపీలో జరగాల్సిన అరాచకాలన్నీ జరిగిపోతున్నాయి. ఈ మాన్యువల్ రిజిస్ట్రేషన్ల తర్వాత ఆస్తులు ఉన్న వారంతా.. తమ ఆస్తి ఉందా లేదా అని ఓ సారి చెక్ చేసుకోవాలేమో ?
పథకాల పేరుతో ఆశ పడి ప్రజలు.. పెద్ద ఎత్తున కేసులు, అవినీతి, క్రిమినల్ రికార్డులు ఉన్న వారికి అధికారం కట్టబెట్టారు. వారి చేతికి అధికారం వచ్చిన తర్వాత ప్రైవేటు ఆస్తులకు కూడా గ్యారంటీ లేకుండా పోయింది. ఆస్తి ఎప్పుడు ఎవరి పేరు మీద మారిపోతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆన్ లైన్ రికార్డుల్లోకి ఎక్కించుకోవడం.. ట్యాంపర్ చేయడం లాంటి అక్రమాలకు ఇప్పటికి లక్షల్లో ఉన్నాయి. ఇప్పుడీ సర్వర్ స్కెచ్ వెనుక అతి పెద్ద దందా ఏదో ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది