సీబీఐ తో అవినాష్ రెడ్డి ఆడుతున్న చదరంగంలో ఇప్పటికి అవినాష్ రెడ్డిదే పైచేయి అయింది. ఆయనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఇందు కోసం నాలుగు షరతులు పెట్టింది. పూచీకత్తులతో పాటు ప్రతి శనివారం విచారణకు హాజరు కావాలని.. చెప్పకుండా విదేశాలకు వెళ్లవద్నది షరతులు పెట్టింది. దీంతో అవినాష్ రిలీఫ్ ఫీలయ్యారు. నాలుగు రోజుల కిందట విచారణ జరిగినప్పుడు తన తల్లికి ఆఫరేషన్ జరుగుతోందని అందుకే తీర్పు వచ్చే వరకూ తనను అరెస్ట్ చేయకుండా రక్షణ ఇవ్వాలని అవినాష్ కోరడంతో ఆ మేరకు రిలీఫ్ ఇచ్చారు. అయితే సర్జరీ జరగలేదని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇవాళ బెయిల్ ఇస్తూ తీర్పు చెప్పిన తర్వాత సునీత తరపు న్యాయవాదులు అవినాష్ రెడ్డి తల్లికి ఎలాంటి ఆపరేషన్ జరగలేదని.. అవినాష్ పై చర్యలు తీసుకోవాలి మెమో దాఖలు చేశారు.
మరో వైపు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సీబీఐ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే మారుతున్న పరిణామాలతో సీబీఐ ఏం ఆలోచిస్తుందో కానీ.. ఇలాంటి విషయాల్లో వెనుకడుగు వేయకుండా పోరాడుతున్న వివేకా కుమార్తె సునీతారెడ్డి మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. గంగిరెడ్డి బెయిల్ విషయంలో ఆమెసుప్రీంకోర్టులో పోరాడి బెయిల్ రద్దు చేయించారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి పిటిషన్ల విషయంలో హైకోర్టు స్పందించిన తీరుపై రెండు సార్లు సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అవినాష్ రెడ్డి విచారణకు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు.. సీబీఐతో ఆడుకుంటున్న వైనం.. కేసు మెరిట్స్ పరిశీలిస్తున్న నిపుణులు ఆయనను అరెస్ట్ చేయకుండా అడ్డుకునేందుకు ఒక్క కారణం కూడా లేదని చెబుతున్నారు.
ఇదే సుప్రీంకోర్టులో వాదించే అవకాశం ఉంది. అవినాష్ రెడ్డికి ప్రతీ సారి తెలంగాణ హైకోర్టులో ఊరట లభిస్తోంది. కానీ సుప్రీంకోర్టులో మాత్రం ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కారణం ఏదైనా.. సుప్రీంకోర్టుకు సీబీఐనో.. సునీత రెడ్డినో పిటిషన్ వేసి.. విచారణ పూర్తయ్యే వరకూ.. అవినాష్ రెడ్డికతి ఊరటే.. ఆయన బెయిల్ పై ఉండొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ కాకూడదనుకుంటున్న ఆయన పట్టుదల ముందు సీబీఐ ప్రయత్నాలు ఫలించడంలేదు. అధికార పవర్ అవినాష్ కే ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తోంది.