వైసీపీ ఎన్డీఏలో చేరబోతోందని ఢిల్లీ బీజేపీ నుంచి కొన్ని లీకులు బయటకు వచ్చాయి. కొంత మంది నేతలు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల నాటికి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా వైసీపీ ఉంటుందని.. ఏపీలో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయంటున్నారు. తెలంగాణ ఎన్నికల కంటే ముందే పొత్తులు ఖరారు చేస్తే… అక్కడా లాభం జరుగుతుందని అందుకే ఈ దశగా ముందడుగు వేస్తున్నామని చెబుతున్నారు.
సీఎం జగన్ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. మూడో రోజు ఆయన చాలా రహస్య సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన బీజేపీ పెద్దలను కలిశారని ఎన్డీఏలోకి మళ్లీ టీడీపీని ఆహ్వానించవద్దని.. తమ పార్టీనే ఎన్డీఏలో చేరుతుందని బీజేపీ పెద్దలకు ఆయన హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ మిత్రపక్షాల కోసం వెదుక్కుంటోంది. ఎన్డీఏలో ఇప్పుడు సీట్లు సాధించే కెపాసిటీ ఉన్న మిత్రపక్షాలు ఏమీ లేవు. శివసేన, అకాలీదళ్, జేడీయూ లాంటి పార్టీలన్నీ దూరమయ్యాయి. శివసేన , జేడీయూ కలసి వచ్చే అవకాశం లేదు. వస్తే దక్షిణాది నుంచే మిత్రపక్షాలను కలుపుకోవాలి.
టీడీపీ ఎన్డీఏలో చేరడానికి రెడీగా ఉంది.అదే జరిగితే.. కేంద్రంలో ఆ పార్టీ కూడా భాగమైనట్లే. అప్పుడు వైసీపీని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టవచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లిక్కర్ స్కాం మీద ఈడీ దాడులు చేయిస్తే.. అగ్రనేతలంతా ఇబ్బంది పడతారు. ఇతర అంశాల్లోనూ అంతే. అందుకే వైసీపీ.. టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోవద్దని.. తాము చేరతామని చెప్పినట్లుగా చెబుతున్నారు. కారణం ఏదైనా మోదీకి చంద్రబాబు అంటే ఇష్టం లేదు.. జగన్ పై అభిమానం ఉంది. అందుకే వైసీపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. ఇదే నిజమైతే.. ముందు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.