రాజమౌళి ఎప్పుడూ సీక్వెల్స్‌పై దృష్టి పెట్టలేదు. కానీ ఈమధ్య తన దృష్టి అటు వైపే వెళ్తోంది. ఆర్.ఆర్.ఆర్కి రెండో భాగం ఉందంటూ ఆమధ్య ఓ హింట్ ఇచ్చాడు. అయితే దానికంటే ముందు ‘ఈగ 2’ తీస్తానని చెప్పాడు. ‘ఈగ 2’ గురించి నాని కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. వీలున్నప్పుడల్లా.. ‘ఈగ 2 ఎప్పుడు సార్..’ అంటూ రాజమౌళిని గుర్తు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న భారీ, క్రేజీ ప్రాజెక్టుల దృష్ట్యా.. రాజమౌళి ‘ఈగ 2’ గురించి ఆలోచించలేదు. అయితే ఈమధ్య తన మనసులో ఈ సీక్వెల్ ఎలా తీస్తే బాగుంటుందన్న ఐడియా వచ్చిందట. ఓ టీమ్ తో ఈ కథని ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఈగ అప్పట్లో ఎలాంటి అంచనాలూ లేకుండా, చిన్న బడ్జెట్ తో విడుదలైంది. ఈసారి అలా జరిగే అవకాశమే లేదు. రాజమౌళి చేయి పడితే.. వందల కోట్లు పెట్టాల్సిందే. అయితే ఈగ 2 మాత్రం పరిమితమైన బడ్జెట్ లో చేయాలన్నది రాజమౌళి ప్లాన్. మహేష్ బాబు సినిమా పూర్తయిన వెంటనే.. ఈ సినిమాని పట్టాలెక్కించే అవకాశం ఉంది. నిజానికి.. మహేష్ బాబు సినిమా ఆలస్యం అవుతుందనుకొన్న పక్షంలో ఈగ 2 మొదలెట్టి, మహేష్ ఖాళీ అయ్యేటప్పటికి.. పూర్తి చేద్దామనుకొన్నారు. కానీ మహేష్ సినిమా దాదాపుగా రూ.1500 కోట్లతో తయారయ్యే ప్రాజెక్ట్. అందుకే ఆ సినిమాపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈగ 2 ని పక్కన పెట్టారు. మహేష్ తో సినిమా పూర్తయిన తరవాత రాజమౌళి చేసే సినిమా దాదాపుగా ఇదే అని టాక్.