నీళ్లు, నిధులు, నియామకాల ఎజెండాతో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం లక్ష్యాన్ని సాధించి నేటికి తొమ్మిదేళ్లు. మరి ప్రజలు అనుకున్నట్లుగా మార్పు వచ్చిందా ? తొమ్మిదేళ్లకు ముందు తెలంగాణ ప్రజలకు తిండి , నీరు లేవు కేసీఆర్ వచ్చిన తర్వాతనే .. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాతనే అవి లభిస్తున్నాయన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు అతిగా ప్రచారం చేస్తున్నారు. కానీ పూర్తిగా అవాస్తవం అని చెప్పలేం. తొమ్మిదేళ్లలో ఇంటింటికి తాగునీరు ఇచ్చే విషయంలో అద్భుతమైన పురోగతి చూపించారు. సాగునీటి కోసం కాళేశ్వరం లాంటిప్రాజెక్టును పూర్తి చేశారు. పాలమూరు -రంగారెడ్డి నిర్మాణంలో ఉంది.
హైదరాబాద్ మంచి అభివృద్ధి సాధించింది. హైదరాబాద్కు విదేశీ నగరాల లుక్స్ వచ్చాయి. మిషన్ భగీరథ.. కాకతీయ వంటి ప్రాజెక్టులతో ప్రజల కనీస అవసరాలు తీరాయి. ఎలా చూసినా తొమ్మిదేళ్ల కిందటితో పోలిస్తే తెలంగాణ ప్రగతిని నమోదు చేసింది. ఈ ప్రగతి రోజూ చూస్తున్న వారికి మామూలేగా అనిపిస్తుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కొత్త సచివాలయం అందుబాటులోకి వచ్చింది. అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మించింది. క్రైమ్ మ్యానిటరింగ్, కమాండ్ కంట్రోల్ చేసేందుకు వీలుగా అతిపెద్ద కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రూపొందించింది . ఉపాధి అవకాశాలూ భారీగా పెరిగాయి. తెలంగాణ పురోగతిలో వంకలు పెట్టడానికి పెద్దగా ఏమీ లేదు.
అయితే రాజకీయంగా కేసీఆర్ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారన్న ఆరోపణ మాత్రం ఉంది. తాను లేదా తన పార్టీ మాత్రమే రాజకీయాల్లో మనుగడ సాధించాలన్న లక్ష్యంతో ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చినప్పటికీ ఇతర పార్టీలను నిర్వీర్యం చేసేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇది బీఆర్ఎస్లో అసంతృప్తికి కారణం అవడంతో పాటు ప్రజల్లోనూ వ్యతిరేక భావన పెంచింది. తెలంగాణ సాధించి అభివృద్ధి చేస్తామని బాధ్యతలు తీసుకున్న కేసీఆర్ అభివృద్ధి పరంగా తన బాధ్యతను తెలంగాణ ప్రజలు సంతృప్తి పడేలా నిర్వహించగలిగారని చెప్పుకోవచ్చు.. మరి ఇతర విషయాల్లో మాత్రం ఆయన తీరును ప్రజలు హర్షించడం కష్టం.