ఒడిషాలోని బాలాసోర్ దగ్గర ఓ గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టింది… ఆ బోగీలు పక్క ట్రాక్ పై పడ్డాయి. ఆ ట్రాక్ మీద నుంచి వస్తున్న బెంగళూరు -హౌరా ఎక్స్ ప్రెస్ ఆ భోగీలను ఢీకొట్టి పట్టాలు తప్పింది. సింపుల్ గా చెప్పుకోవాలంటే ప్రమాదం జరిగిన తీరు ఇది. అసలు రైళ్లు ఎదురెదురుగా రావడానికే అవకాశం లేని విధంగా టెక్నాలజీ తెచ్చాలని చాలా కాలంగా హోరెత్తిస్తున్నారు. మరి ఇక్కడ ఎదురెదురుగా వస్తున్నా.. అదీ కూడా అత్యంత వేగంతో వెళ్తున్నా ఎందుకు నిరోధించలేకపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా.. మరో రైలు పక్క ట్రాక్ మీద వెళ్తూంటే ఆపలేకపోయారు. రైల్వే భద్రత వ్యవస్థ అంతా డొల్లేనని ఈ ప్రమాదం నిరూపిస్తోంది.
ఒడిషాలో జరిగిన రైలు ప్రమాదంలో రెండు వందల మందికిపైగా చనిపోయారు.ఇంకా ఎంత మంది ప్రాణాలు వదులుతారో చెప్పలేనంతగా గాయపడ్డారు. ఈ పాపానికి ఎవరు బాధ్యత వహిస్తారు ?. మానవ తప్పిదమనో.. మరొకటనో చెప్పి. .. తలా కొంత ఆర్థిక సాయం ప్రకటించేస్తారు. కానీ టెక్నాలజీ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన సమయంలో ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగడం అంటే… ఖచ్చితంగా వ్యవస్థలోనే లోపం ఉంది. ప్రయాణికుల భద్రతతో రైల్వేలు ఆటాడుకుంటున్నాయని చెప్పక తప్పదు. ఇది పాలకులు వ్యవస్థలో తెచ్చి పెట్టిన నిర్లక్ష్య ఫలితమా…. మరో కారణమా అన్నది ఎప్పటికీ బయటకు రాదు.
దేశంలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలు టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలోనే జరిగాయి. ఇప్పుడు నూటయాభై కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపేలా ట్రాకుల్ని రెడీ చేశామని వందే భారత్ పేరుతో ప్రతీ ట్రైన్ కూ ప్రధాని మోదీ జెండా ఊపుతున్నారు. ఆ రైళ్లను ప్రారంభించడాన్ని తన గొప్పగా చెబుతున్నారు. మరి ఈ ప్రమాదానికి కూడా ఆయన బాధ్యత వహించాల్సి ఉంది. కొన్ని వందల మంది భారత పౌరులు ఈ ప్రమాదం కారణంగా ప్రాణాలు పోగొట్టుకోవడం అంటే.. ప్రపంచ ముందు భారత్ నగుబాటుకు గురైనట్లే.