దేశంలో మూడో ఫ్రంట్‌కు ఉనికి లేదని అందుకే నితీష్ కుమార్ నిర్వహిస్తున్న పట్నా భేటీకి తాము వెళ్లడం లేదని కేటీఆర్ ప్రకటించడం పై రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ పీఠం ఎక్కబోతున్నామని కేసీఆర్ చాలా సార్లు ధీమాగా చెప్పారు. ఢిల్లీ పీఠం పై కూర్చుంటానని ఎర్రకోటపై జెండా ఎగురవేస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు అడుగు ప్రగతి భవన్ కూడా దాటడం లేదు.ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం లేదని చెబుతున్నారు.
భారతీయ జనతా పార్టీని ముఖ్యంగా నరేంద్రమోదీని మరోసారి ప్రధాని కాకుండా అడ్డుకోవాలన్న లక్ష్యంతో పట్నాలో పన్నెండో తేదీన సమావేశం అవుతున్నాయి. విపక్షాల ఐక్యతను దేశ ప్రజల ముందు ఉంచడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉంటామనుకున్న ప్రతి పార్టీ ఈ సమావేశానికి వెళ్తోంది. కానీ బీజేపీపై భీకర యుద్ధం ప్రకటించిన బీఆర్ఎస్ మాత్రం వెళ్లడం లేదు. దేశంలో మూడో ప్రత్యామ్నాయం అవసరం ఉందని.. ఫెడరల్ ఫ్రంట్ పెడతానని దేశవ్యాప్తంగా తిరిగిన నేత కేసీఆర్. వర్కవుట్ కాకపోవడంతో కాంగ్రెస్, బీజేపీకు ప్రత్యామ్నాయంగా మరో వేదిక ఉండాలని తన పార్టీ పేరుతో భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు.
కానీ ఇప్పుడు కేటీఆర్ అనూహ్యంగా మూడో ప్రత్యామ్నాయం లేదన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో ఏ మాత్రం లడాయి పెట్టుకోవాలన్న ఆలోచన కేసీఆర్ కు లేదని అంటున్నారు. ఇటీవల కేజ్రీవాల్ తెలంగాణకు వచ్చినప్పుడు బీజేపీ విమర్శించారు.. కానీ అందులోనూ ఎన్నో పరిమితులు పెట్టుకున్నారు. బీజేపీ వైపు నుంచి ఏమైనా రాజీ సంకేతాలు వచ్చాయా లేకపోతే అసలు బీజేపీని రెచ్చగొట్టడం ఎందుకన్న ఉద్దేశంతో ఆయన సైలెంట్ అయ్యారని చెబుతున్నారు.