తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. శనివారం ఉదయం వరకూ ఆయన ఢిల్లీ పర్యటన గురించి సీక్రెట్ గానే ఉంది. శనివారం సాయంత్రం అమిత్ షాతో… ఆదివారం ప్రధాని మోదీతో భేటీ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఏమీ అధికారంలో లేరు కాబట్టి వారితో ఎలాంటి అధికారిక విషయాలు చర్చించే అవకాశం లేదు. కేవలం రాజకీయ అంశాలపై మాత్రమే చర్చించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోవద్దని తానే ఎన్డీఏలో చేరుతానని సీఎం జగన్ ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే కొన్ని విషయాన్ని బీజేపీ నుంచి వైసీపీకి సహకారం అందుతోందని చెబుతున్నారు. అయితే అనూహ్యంగా చంద్రబాబును మోదీ, షా పిలవడంతో ఇప్పుడు ఏమైనా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల పలు సందర్భాల్ల మోదీ విధానాలను తాను సమర్థిస్తానని .. ఎన్డీఏలో చేరికపై కాలమే నిర్ణయిస్తుందని చెబుతున్నారు.
ఏపీలో ఉన్న అధికార పార్టీ బీజేపీకి అడ్డం తిరగడానికి ఏ మాత్రం సిద్ధంగా లేదు. వారు చెప్పినవన్నీ చేయాల్సి వస్తోంది. ఇలాంటి పార్టీని వదులుకుని టీడీపీతో బీజేపీ జట్టు కడుతుందా అన్నది కూడా సందేహమే. పొత్తులేమీ అక్కర్లేదని.. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చూస్తే చాలని.. ఎన్నికల తర్వాత మద్దతుగా ఉంటామని టీడీపీ వర్గాలు ప్రతిపాదిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనా ఎన్నికల వేడి ప్రారంభమైన సమయంలో మోదీ , షాలతో చంద్రబాబు భేటీ కానుండటం చర్చనీయాంశం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.