ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేసే టీడీపీ నేతల ఇళ్లపైకి రౌడీముకల్ని పంపి దాడులు చేయించడం … పోలీసులు చూస్తూ ఉండటం కామన్ గా మారిపోయింది. గతంలో పట్టాభి ఇంటిపై మూడు సార్లు దాడి చేశారు. తాజాగా నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డి టార్గెట్ చేశారు. వైసీపీపై విరుచుకుపడే నేతల్లో ఒకరిగా పేరున్న ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి చేశారు. దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంటి వద్ద ఓ కారులో దుండగుల్ని దించి వెళ్లి వెళ్లడం .. వారు కళ్లతో ఇంట్లోకి చొరబడటం… కాసేపటికే.. ఆనం అనుచరులు వెంటబడటంతో పారిపోవడం వంటి దృశ్యాలు ఉన్న సీసీ పుటేజీ బయటకు వచ్చింది. కారుతో పాటు కొంత మంది బైకుల్లో వచ్చారు. మొత్తం 8 మంది దుండగులు నెల్లూరులో ఆయన నివాసం ఉన్న ఓ అపార్ట్ మెంట్ వద్దకు వచ్చారు. వరుసగా దాడులు చేసుకుంటూ ఆనం ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని టీడీపీ నేతలు తరమడంతో రెండు బైక్ లు అక్కడే వదిలి వారు పారిపోయారు.
ఈ ఘటనతో నెల్లూరు నగరంలో కలకలం రేగింది. జిల్లాలోని టీడీపీ నేతలంతా వెంకట రమణారెడ్డిని పరామర్శించారు. మాజీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.. ఆనంను పరామర్శించారు. ప్రశాంతమైన నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అధికార ప్రతినిధిపై దాడి చేయడం అత్యంత దుర్మార్గం అని చెప్పారు. దాడి ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సికందర్ రెడ్డిని వారు పరామర్శించారు.
ఘాటు విమర్శలు చేసే వారిని భయపెట్టడానికి ఇలా దాడులు చేయించడం వైసీపీ హైకమాండ్ వ్యూహమని చెబుతున్నారు. ఇంత దాడి జరిగినా పోలీసులు ఆ వైపు కన్నెత్తి చూడలేదు. ఇద్దరు కానిస్టేబుళ్లను పంపించి.. మ మ అనిపించారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇది అని సీసీ కెమెరా దృశ్యాలను చూపిస్తున్నారు.