ప్రభుత్వాధినేతలు నిజాయితీగా ఉండడం ఒక ఎత్తు.. నిజాయితీగా ఉంటున్నట్లు ప్రజలకు కనిపించడం ఒక ఎత్తు. అలా కనిపించడం అనేది రాజకీయాల్లో చాలా కీలకం. అయితే దానికోసం వేర్వేరు మార్గాలుంటాయి. ఒకటి తమ నిజాయితీ ప్రజలకు తెలిసేలా ఏవైనా కార్యక్రమాలు చేపట్టడం…. ఇది చాలా క్లిష్టమైన పని. రెండు- ప్రజలకు బాగా పాపులర్ అయిన, నిజాయితీ లేని వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం! ప్రభుత్వాధినేతలుగా ఉన్న వారికి ఈ రెండో పద్ధతి చాలా ఈజీ! ప్రస్తుతం తమిళనాడులో సీఎం , పురట్చితలైవి జయలలిత అదే పనిచేస్తున్నారు. మంత్రుల మీద ఎడాపెడా కత్తి దూస్తున్నారు.
ప్రస్తుతం తమిళనాడులో రాజ్యమేలుతున్న అమ్మ సర్కారుకు మిగిలి ఉన్న పదవీకాలం రెండు నెలలు మాత్రమే. ఒక వేళ సదరు మంత్రులు అవినీతి పరులే అయితే గనుక.. వారు దోచుకోవడానికి ఇన్నాళ్ల పదవీకాలమే చాలా ఎక్కువ. ఇప్పుడు తీసేయడం వలన వారికి పెద్దగా వచ్చే నష్టం ఉండకపోవచ్చు. కానీ క్రమశిక్షణ దారి తప్పినందుకు తాను కఠిన చర్యలు తీసుకుంటున్నా అంటూ.. జనం ముందు చాటుకోవడానికి జయలలితకు ఒక మంచి అవకాశం లభించినట్లే లెక్క.
జయలలిత కేవలం కొన్ని రోజుల కిందట.. తన రెండో భార్య తో కలిసి ఉన్న ఫోటోలు బయటపడిన నేరానికి ఒక మంత్రి బీవీ రమణను పదవినుంచి తొలగించేశారు. నిజానికి ఆయనను మంత్రి పదవినుంచి తొలగించడం ద్వారా చేటు కంటే మేలు ఎక్కువగా చేశారనేది స్థానికుల ఉవాచ. ఎందుకంటే.. ఆయన తన సొంత నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేనంత చెడ్డపేరు ఆయన మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పదవి పోవడం, టికెట్ కూడా గ్యారంటీ లేనందున… ఆయన కనీసం సొమ్ము ఖర్చు పెట్టి పోగొట్టుకునే భారం తప్పించుకున్నాడు. తాజాగా జయలలిత మరో మంత్రి టీకేఎం చిన్నయ్యను కూడా క్రమశిక్షణ కారణాల మీదనే తప్పించారు.
ఇలా అవినీతి పరుల మీద వేటు వేసేయడం అనేది తన నిజాయితీకి చిహ్నం అని జనం గుర్తించాలని అమ్మ కోరుకుంటే తప్పులేదు. అయితే.. ఇదంతా ఓడిపోయే ప్రమాదం పొంచిఉన్న మంత్రులకు అమ్మ కల్పిస్తున్న మహదవకాశంగా.. జనం వాస్తవాన్ని గుర్తిస్తే మాత్రం బెడిసికొడుతుంది.