కేసీఆర్ బహిరంగసభా వేదికపై గత రెండు, మూడేళ్లలో ఎక్కడ మాట్లాడినా ఆయన ప్రసంగంలో సగం బీజేపీ, మోదీని విమర్శించడానికే ఉండేది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని చెప్పేవారు . బీజేపీ చేసిన నిర్వాకాలంటూ ఎండగట్టేవారు. గత ఏడాదిన్నర కాలంలో చాలా జిల్లాల సమీకృత కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలకు వెళ్లి బహిరంగసభలు ఏర్పాటు చేశారు. అన్నింటిలోనూ బీజేపీపై యుద్ధం ప్రకటించారు. కానీ ఈ ఆదివారం మహారాష్ట్ర సరిహద్దులోని నిర్మల్ కలెక్టరేట్ ఓపెనింగ్ వెళ్లి నిర్వహించిన బహిరంగసభలో బీజేపీ, మోదీ మాటే ప్రస్తావించలేదు. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేదు.
దేశమమంతా తెలంగాణ మోడల్ కోరుతోందని చెప్పుకొచ్చారు. దశాబ్ది వేడుకల్లో గంటన్నర ప్రసంగించిన తర్వాతకూడా చేసినవి చెప్పడానికి ఇంకా మిగిలిపోయాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. మెడికల్ కాలేజీలు సమైక్య రాష్ట్రంలో ఉంటే అసుల వచ్చేవి కాదన్నారు. ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. గతంలో తాగు, కరెంట్, సాగునీటి సమస్యలు ఉండేవి. వీటన్నింటిని 9 ఏండ్లలో అధిగమించామని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది కాబట్టి.. భవిష్యత్ కోసం పురోగమించాలని పిలుపునిచ్చారు.
మహారాష్ట్ర ప్రజలు మన పథకాలను చూసి తెలంగాణ మోడల్ కావాలని కోరుతున్నారు. తెలంగాణ మోడల్ భారతదేశమంతా మార్మోగుతుంది. అందుకు మీరే కారణం అని కేసీఆర్ ఉద్యోగులను అభినందించారు. కేసీఆర్ ప్రసంగంలో జాతీయ అంశాలు లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలుకూడా ఆశ్చర్యపోతున్నారు. కవితను అరెస్ట్ చేయకుండా బీజేపీతో ఒప్పందానికి రావడం వల్లనే కేసీఆర్ ప్రసంగంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేసీఆర్ ఇలా బీజేపీని విమర్శించకపోవడం.. బీజేపీ నేతలకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఏదో లాలూచీ జరిగిందన్న ప్రచారానికి ఇది బలం ఇస్తోందని వారు వాపోతున్నారు.